ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో లవ్ జిహాద్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. ప్రేమ పేరుతో జరుగుతున్న మత మార్పిళ్లకు చెక్ పెట్టడానికి ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్. ఈ లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠిన చట్టాన్ని తీసుకొస్తామని గతంలోనే అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈ ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతకుముందు దీనికి సంబంధించి ప్రత్యేక వ్యూహాన్నిరచించాలని, దీనికోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఇంతకుముందు సీఎం యోగి అధికారులను ఆదేశించారు. హిందూ యువతులకు ప్రేమ పేరుతో వల వేసి, వాళ్లను మతం మారేలా ఒత్తిడి తెస్తున్నారని కొన్ని కాషాయ దళాలు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి లవ్ జిహాద్ అనే పేరు కూడా వాళ్లు పెట్టిందే. యూపీ న్యాయ శాఖ పరిధిలో ఉన్న ఈ లవ్ జిహాద్ చట్టాన్ని చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ బిల్లుగా పిలుస్తున్నారు. కాగా, మత మార్పిడి వ్యతిరేక బిల్లు 2020ని రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.