ఫిబ్రవరి 24-26 తేదీల మధ్య ఇండియాకు ట్రంప్ ? కుదరనున్న భారీ డీల్ !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-26 తేదీల మధ్య ఇండియాను సందర్శించే అవకాశాలున్నాయి. అయితే ఈ తేదీలు ఇంకా ఖరారు కావలసి ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక భారత సందర్శనకు రావడం ఇదే మొదటిసారి. తన దేశంలో అభిశంసనను ఎదుర్కొంటూ.. అదే సమయంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన భారత విజిట్ పై వైట్ హౌస్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆయన మన దేశాన్ని సందర్శించినప్పుడు.. ఉభయ దేశాల […]

ఫిబ్రవరి 24-26 తేదీల మధ్య ఇండియాకు ట్రంప్ ? కుదరనున్న భారీ డీల్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 29, 2020 | 6:03 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-26 తేదీల మధ్య ఇండియాను సందర్శించే అవకాశాలున్నాయి. అయితే ఈ తేదీలు ఇంకా ఖరారు కావలసి ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక భారత సందర్శనకు రావడం ఇదే మొదటిసారి. తన దేశంలో అభిశంసనను ఎదుర్కొంటూ.. అదే సమయంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన భారత విజిట్ పై వైట్ హౌస్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆయన మన దేశాన్ని సందర్శించినప్పుడు.. ఉభయ దేశాల మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదరవచ్చునని తెలుస్తోంది. ట్రంప్ రాకకు ముందు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ రాబర్ట్ లిథిజర్ ఫిబ్రవరి రెండో వారంలో ఢిల్లీని చేరుకొని మెగా ట్రేడ్ డీల్ ను ఖరారు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇది 10 బిలియన్ డాలర్ల (రూ. 71 వేల కోట్ల) ఒప్పందమని తెలిసింది. రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ కు ఇది మార్గాన్ని సుగమం చేస్తుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

ఈ డీల్ కు సంబంధించిన లాంఛనాలను రాబర్ట్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఖరారు చేయవచ్చు. దావోస్ లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా ఉభయ దేశాల అధికారుల మధ్య సమావేశాలు జరిగాయి. యుఎస్ నుంచి ఆరుగురు సభ్యులతో కూడిన ఓ బృందం ఈ మధ్య ఢిల్లీని సందర్శించి గోయెల్ తోను, ఇతర అధికారులతోను చర్చలు జరిపింది. గోయెల్ గత ఏడాది అమెరికాలో లిథిజర్ తో భేటీ అయ్యారు.

గత కొంతకాలంగా భారత-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు కొంతవరకు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అమెరికన్ వస్తువులపై  భారత ప్రభుత్వం సుంకాలు పెంచడాన్ని ఆ దేశం జీర్ణించుకోలేకపోతోంది. రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ కొనసాగుతోంది. ట్రంప్, ప్రధాని మోడీ కొన్ని సార్లు భేటీ అయినప్పటికీ.. ఈ సమస్యపై వారు చర్చించలేదు. అయితే భారత్ తమ మిత్ర దేశమని, మోడీ తనకు మంచి మిత్రులని ట్రంప్ ప్రశంసిస్తూ వచ్చారు.