
అగ్రరాజ్యం అమెరికా ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే అత్యధిక కోవిడ్-19 బాధితులతో విలవిల్లాడుతోన్న ఆ దేశం తాజాగా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అమెరికాలో బుధవారం ఒక్కరోజే దాదాపు 50 వేల కరోనా కేసులు నమోదైనట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. ఆ దేశంలో ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26,85,806కు చేరింది. వీరిలో 1,28,061 మంది వ్యాధితో పోరాడలేక ప్రాణాలు విడిచారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1,06,67,217 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మృతుల సంఖ్య 5,15,600 దాటింది.