
కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా పరీక్షా విధానమే మారిపోయింది. తాజాగా యూపీఎస్‌సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలను సవరించింది. షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 4న ఎగ్జామ్స్ జరుగుతాయని యూపీఎస్‌సీ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో అభ్యర్ధులు సివిల్స్ ప్రిలిమనరీ, ఐఎఫ్‌ఎస్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరవుతున్నారు. అభ్యర్థుల అభ్యర్ధన మేరకు వారి పరీక్షా కేంద్రాలను మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు యూపీఎస్‌సీ తెలిపింది. ఆయా కేంద్రాల వసతులను బట్టి అభ్యర్ధులను కేటాయించడం జరుగుతుందని యూపీఎస్‌సీ తెలిపింది. అభ్యర్ధులు పరీక్ష కేంద్రాల మార్పుకు సంబంధించిన ఆప్షన్‌ను జులై 7-13 వరకూ జులై 20-24 వరకూ రెండు దశల్లో కమిషన్ వెబ్‌సైట్ https://upsconline.nic.in ద్వారా ఎంచుకోవాలని సూచించింది. అభ్యర్ధుల వినతులను ‘ఫస్ట్ అప్లై-ఫస్ట్ అలాట్’ పద్ధతిన పరిశీలిస్తామని స్పష్టం చేసింది యూపీఎస్‌సీ. సీలింగ్ కారణంగా తాము కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని పొందలేని వారు మిగిలిన వాటి నుంచి ఒక కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది.