దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. మాయదారి రోగం బారిన పడుతున్న ప్రముఖుల జాబిత పెరుగుతుంది. అటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తేడా లేకుండా అందరిని టచ్ చేస్తోంది కరోనా వైరస్. మరో వైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దగ్గరపడుతున్న వేళ కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. దీంతో ఒక్కొక్కరికి పాజిటివ్ గా నిర్ధారణ అవుతోంది. తాజాగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ తాను కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చినట్లు శుక్రవారం ఆయనే స్వయంగా తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్టర్ ద్వారా విషయాన్ని వెల్లడించారు. తనకు ఎలాంటి సమస్యలు లేవని, ఆరోగ్యం బాగానే ఉన్నానని తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉంటూ హోం ఐసోలేషన్ ద్వారా చికిత్స పొందుతున్నానని సురేష్ ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
I have tested #Covid19 positive today. I am doing fine. Taking the advise of doctors.
Requesting all those who have come in close contact with me in the last few days to monitor their health and get tested in case of any symptoms. @PMOIndia
— Suresh Angadi (@SureshAngadi_) September 11, 2020
కాగా, ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులంతా తప్పనిసరిగా కరోనా పరీక్ష చేయించుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చిన సభ్యులు మాత్రమే సమావేశాలకు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. దీంతో పార్లమెంట్ సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. వీరి కోసం గుర్తింపు పొందిన ఆస్పత్రులు, లాబారేటరీలతో పాటు పార్లమెంట్ హౌజ్ లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.