కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్ని లక్షల ఇళ్ళు కట్టినా కేంద్రం వాటా సొమ్ములు తీసుకొచ్చే బాధ్యత తనదేనని ప్రకటించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్రమంత్రి విమర్శించారు. లక్ష్మణ్ తో కలసి ముషీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతోన్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంలో కిషన్ రెడ్డిని కలసిన లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2015 లో శంకుస్థాపన చేసిన ఇంటి నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాకపోవటం ప్రభుత్వ చేతకాని తనమని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూం ఇళ్ళను వాడుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ళ కోసం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారని.. కేంద్ర నిధులతో ఆంధ్రప్రదేశ్ లో 7లక్షల ఇళ్లు పూర్తి చేశారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో దాదాపు 20 లక్షల మంది పేదలకు ఇళ్లు లేవని కిషన్ రెడ్డి అన్నారు. అందరికీ ఇళ్లు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆయన తెలంగాణ సర్కారుని కోరారు.