దేశ రాజధానిలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో మరోసారి అలజడి చెలరేగింది. ఈ క్రమంలో భారీ దాడులకు టెర్రరిస్టులు వేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలోని సరయ్ కాలేఖాన్ ఏరియాలో ఇద్దరు జైషే మహ్మద్ తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి తుపాకులు, మారణాయధాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని ఇంటిలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో అలెర్టైన ఢిల్లీ పోలీసు స్పెషల్ టీమ్ విసృత తనిఖీలు చేపట్టింది. సోమవారం రాత్రి పక్కా ప్రణాళిక చేపట్టి సరయ్ కాలే ఖాన్ ఏరియాలో ఇద్దరు అనుమానిత టెర్రరిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని జమ్ముకశ్మీర్‌కు చెందిన అబ్దుల్ లతిఫ్ మీర్, అష్రఫ్ ఖటానాగా గుర్తించారు.
జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు వర్క్ చేస్తోన్న వీరు గతంలో పీఓకేకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. భారత ఆర్మీ వీరిని అడ్డుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు ఢిల్లీలో దాడులు జరిపి ఆ తర్వాత నేపాల్ మీదుగా పీఓకే వెళ్లాలని వీరు ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా.. ఈ కుట్రలను పోలీసులు భగ్నం చేసి టెర్రరిస్టులను అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. గత ఆగస్టులో కూడా ఇలాంటి కుట్రనే ఢిల్లీ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో దౌలా ఖాన్ ఏరియాలో ఓ ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి 15 కేజీల ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
Also Read :
స్టేట్ సెక్యూర్టీ కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు చోటు కల్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
జగిత్యాల : పాడుబడ్డ ఇంట్లో కుళ్లిన స్థితిలో యువతీ, యువకుల మృతదేహాలు..ప్రేమ జంటేనా..? లేక !