భారీ వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలమైంది. పల్లె చెరువు పోటేత్తి పాతబస్తీ నీటమునిగిపోయింది. మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్ మహానగరాన్ని ముంచెసింది. పలు కాలనీ జలమయమై వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షం తగ్గినా జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక అవస్థలు పడుతున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాతపడ్డారని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. పల్లె చెరువులో 6 మృతదేహాలు గుర్తించినట్లు తెలిపిన జీహచ్ఎంసీ అధికారులు మరో 9 మంది గల్లంతైనట్లు వెల్లడించారు.
పాతబస్తీ లో పాత భవనం గోడ కూలి 9 మంది మృతి చెందారు. అటు, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి నీరు రావడంతో బాలుడు మృతి చెందారు. బంజారాహిల్స్‌లో సెల్లార్ నీటి తోడేందుకు మోటార్ వేస్తుండగా విద్యుత్ షాక్‌తో డాక్టర్ సతీష్‌రెడ్డి మృతి చెందారు. నాగోల్ బండ్లగూడ మల్లికార్జున నగర్‌లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన పోస్టుమాన్ గల్లంతయ్యారు. హస్మత్‌పేట్ అంజయ్యనగర్‌లో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయారు.శాలిబండలో ఓ భవనం గోడ కూలిన ప్రమాదంలో మహిళ తృటిలో ప్రాణాలతో బయటపడింది. అటు ఫలక్‌నుమా అల్‌జుబేరా కాలనీలో 400 ఇళ్లు నీటమునిగిపోయాయి. మూసాపేట్ మెట్రోస్టేషన్ వద్ద రోడ్డు కుంగి సర్ఫెజ్ వాల్ ధ్వంసమైంది.