Tungnath Temple: ఓ వైపు మందాకిని మరోవైపు అలకనందానది మధ్యలో చంద్రశిలపై ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం

|

Jun 06, 2021 | 8:19 PM

Tungnath Temple : భారత దేశంలో మనం చూడని ఆలయాలు ఎన్నో... మనకు తెలిసిన వింతలు , విశేషాలు రహస్యాలు ఈ ఆలయాలకు నిలయాలు. మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్లు. ఒకొక్క ఆలయానికి ఒక్కో

Tungnath Temple: ఓ వైపు మందాకిని మరోవైపు అలకనందానది మధ్యలో చంద్రశిలపై  ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం
Tunganath Temple
Follow us on

Tungnath Temple : భారత దేశంలో మనం చూడని ఆలయాలు ఎన్నో… మనకు తెలిసిన వింతలు , విశేషాలు రహస్యాలు ఈ ఆలయాలకు నిలయాలు. మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్లు. ఒకొక్క ఆలయానికి ఒక్కో ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు. అయితే ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంది. ఈరోజు ప్రపంచంలోనేఎత్తైన శివాలయం తుంగనాథ్‌ మహాదేవుడుగురించి తెలుసుకుందాం.

హిమాలయ ప్రాంతం మహిమాన్విత ఆలయాలకు నిలయం. ఎత్తైన పర్వతశ్రేణుల మధ్య, ప్రకృతి ఒడిలో పరమాత్మను దర్శించుకునే భాగ్యం ఇక్కడే లభిస్తుంది. మనిషికి ఇహ పరాల మీద వ్యామోహం తగ్గి దేవుడి పై మనసు లగ్నం చేసే ఆలయాల్లో ఒకటి తుంగనాథ్ ఆలయం. ఈ ఆలయం తుంగనాథ పర్వతశ్రేణులలో భాగంగా చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి చూస్తే నలువైపులా హిమాలయాలే దర్శనమిస్తాయి. ఇంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి చంద్రుడు సైతం పరవశించిపోయాడట. ఆ పరవశంలో సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడట. అందుకనే ఈ పర్వతానికి చంద్రశిల అన్న పేరు వచ్చిందని పురాణాల కథనం.
ఈ చంద్ర శిలపై రావణ సంహారం అనంతరం రాముడు సైతం ఇక్కడే తపస్సుని ఆచరించరించాడనే ఓ గాథ కూడా ఉంది.

‘పంచ కేదార’ ఆలయాల్లో ఒకటి ఈ తుంగనాథ్‌ క్షేత్రం. ఈ పంచ కేదారాల వెనక కూడా ఓ గాథ ఉంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత పాండవులంతా శివుని ప్రసన్నం చేసుకోవాలనుకున్నారట. కురుసంగ్రామంలో తెలిసోతెలియకో అనేకమందిని చంపిన పాపం పరిహారం కోసం పాండవులు పరమేశ్వరుడిని వేడుకున్నారట.

అయితే శివుడుకి పాండవులు కురుక్షేత్రంలో ఎంతో కొంత తప్పు చేశారనే అభిప్రాయం ఉంది. అందుకనే వారికి కనిపించకుండా ఉండేందుకు ఆయన వృషభ రూపంలోకి మారిపోయాడట. అలా వృషభంలా మారి సంచరిస్తున్న శివుడు ఒకసారి భీమునికి ఎదురుపడ్డాడు. అసాధారణమైన తేజస్సుతో ఉన్న ఆ వృషభాన్ని చూసిన భీముడు అది ఖచ్చితంగా పరమేశ్వరుని రూపమే అని నిశ్చయించుకున్నాడు. అంతేకాదు.. దానిని గట్టిగా పట్టుకునే ప్రయత్నమూ చేశాడు. మరి పరమేశ్వరుడు భీముడికి చిక్కకుండా అదృశ్యమైపోయి వేర్వేరు చోట్ల వేర్వేరు భాగాలుగా ప్రత్యక్షమయ్యాడట. అలా వృషభరూపంలోని శివుడు ఐదు చోట్ల వెలసిన ప్రాంతాలే పంచకేదార క్షేత్రాలు.

పంచకేదార క్షేత్రాలలో వృషభరూపంలోని శివుని బాహువులు పడిన చోటే తుంగనాథ్‌ క్షేత్రం. తుంగం అంటే పర్వతం అని అర్థం. హిమాలయాలలోని సమున్నత పర్వతశ్రేణికి అధిపతి కాబట్టి ఇక్కడి శివుని తుంగనాథుడు అన్న పేరుతో పిలుచుకుంటారు.

ఒకపక్కన మందాకినీ నది, మరో పక్క అలకనంద నది పారుతుండగా మధ్యలోని చంద్రశిల కొండ మీద ఉండే తుంగనాథ్‌ ఆలయాన్ని చేరుకోవడం ఓ అద్భుతమైన అనుభూతి. శీతకాలంలో మాత్రం ఈ కాస్త దూరం కూడా దుర్గమంగా మారిపోతుంది. అందుకనే ఆ సమయంలో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక్కడి తుంగనాథుని ఉత్సవవిగ్రహాన్ని మోకుమఠ్‌ అనే సమీప గ్రామానికి తీసుకువెళ్లి నిత్యపూజలను నిర్వహిస్తారు. అయితే కొందరు సాధకులు మాత్రం ఎవరి కంటా పడకుండా ఉండేందుకు శీతకాలంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారని చెబుతారు.

పేరుకి తగినట్లుగానే ఈ ఆలయం 12 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా నిలుస్తోంది. అవడానికి ఇంత ఎత్తున ఉన్నా, మిగతా పంచకేదార ఆలయాలతో పోలిస్తే తుంగనాథ ఆలయాన్ని చేరుకోవడం తేలికే.. 58వ నెంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న చోప్టా అనే గ్రామం వద్ద దిగి ఓ నాలుగు కిలోమీటర్లు నడిస్తే చాలు, ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

Also Read: తెల్ల జుట్టుని నల్లగా, ఒత్తుగా పొడవుగా చేసుకోవడానికి వంటింట్లో ఉండే వస్తువులతో నేచురల్ టిప్స్