తెలంగాణ ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ప్రారంభించిన కార్గో, పార్సిల్ సర్వీస్ విజయవంతం అవుతోంది.
ఇటీవలే పీసీసీ ( పార్సిల్-కొరియర్-కార్గో) సేవలను వినియోగదారుకు మరింత దగ్గర అయ్యేందుకు చార్జీలను తగ్గించినట్టు ప్రకటించింది. తగ్గించిన చార్జీలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది.
ఇప్పటి వరకు 0-10 కిలోల వరకు ఉన్న స్లాబును 0-5 కిలోలకు కుదించింది. 6-10 కిలోలకు మరో స్లాబును ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 0 నుంచి 10 కిలోల బరువు ఉన్న పార్సిల్‌ను 75 కిలోమీటర్లు తరలించేందుకు రూ. 50 ఛార్జీ చేసేవారు. ప్రస్తుతం ఐదు కిలోల లోపు పార్సిల్‌ను 75 కిలోమీటర్లు తరలించేందుకు రూ. 20 మాత్రమే తీసుకుంటున్నారు. 6 నుంచి 10 కిలోల బరువు ఉన్న పార్సిల్స్‌కు రూ. 50 వసూలు చేస్తున్నారు.
అంతర్రాష్ట్ర రవాణా ఛార్జీలను సైతం తగ్గించింది. గతంలో 250 గ్రాముల పార్సిల్‌ను తరలించేందుకు రూ. 75 వసూలు చేయగా ప్రస్తుతం రూ. 40కి తగ్గించారు. వినూత్న ప్రయోగాలతో ముందుకు వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ అడుగు పెట్టిన ప్రతి చోట విజయాన్ని అందుకుంటోంది.