జాతీయ స్థాయిలో చేపట్టే పథకాలకు సైతం తెలంగాణ స్ఫూర్తినిస్తున్న విషయం ఆనందకరం : టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు
భారతరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో తెలంగాణ గురించి ప్రస్తావించారని టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు..

భారతరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో తెలంగాణ గురించి ప్రస్తావించారని టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి రాష్ట్రపతి గొప్పగా చెప్పడం గమనార్హమని ఆయన అన్నారు. రైతుబంధు పథకాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించారన్న ఆయన, తెలంగాణ ప్రభుత్వం దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని నామా చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో చేపట్టే పథకాలకు సైతం తెలంగాణ స్ఫూర్తినిస్తున్న విషయం ఆనందకరమని ఆయన అన్నారు. ఇది ఎన్నికల సమయం కాదని.. కేంద్రంతో కలిసి పనిచేస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకోవాలని ఆయన అన్నారు. రైతులకు కావలసినంత నీరు, ఉచితంగా విద్యను అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని నామా స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటకు మెరుగైన గిట్టుబాటు ధర, సుబాబుల్, జామాయిల్ వంటి పంటల విషయం కూడా మా దృష్టికి వచ్చాయని, వీటి గురించి కూడా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.