టిక్ టాక్ తో సహా 58 చైనీస్ యాప్ లపై ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో.. టిక్ టాక్ ఇండియా తాము కొన్ని వివరణలు ఇస్తామని ప్రకటించింది. భారతీయ చట్టాల ప్రకారం, వ్యక్తుల డేటా ప్రైవసీ, సెక్యూరిటీలకు అనుగుణంగా నడుచుకుంటామని, ఇండియాలోని యూజర్ల సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయబోమని టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఒక ప్రకటనలో తెలిపారు. చైనా ప్రభుత్వంతో గానీ, మరే ఇతర దేశాలతో గానీ మన యూజర్ల సమాచారాన్ని షేర్ చేసుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వ సంస్థలతో సమావేశమయ్యేందుకు తమను ఆహ్వానించినట్టు చెప్పిన ఆయన.. యూజర్ల ప్రైవసీ, ఇంటిగ్రిటీకి తాము ఎంతో ప్రాధాన్యమిస్తామని అన్నారు. టిక్ టాక్ 14 భారతీయ భాషల్లో అందుబాటులో ఉందని, అనేకమంది ఆర్టిస్టులు, సెలబ్రిటీలు, విద్యావేత్తలు తమ మనుగడకు దీనిపై ఆధారపడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కోట్లాదిమంది దీన్ని ఆదరిస్తున్నట్టు నిఖిల్ గాంధీ తెలిపారు. వీరిలో చాలామంది తొలిసారి ఇంటర్నెట్ యూజర్లని ఆయన వివరించారు.