
చైనాలోని వూహాన్ సిటీలో గల వాటర్ పార్క్ లో వేలాది మంది ముఖాలకు ఎలాంటి మాస్కులు గానీ, చేతులకు గ్లోవ్స్ గానీ లేకుండా ఎంజాయ్ చేశారు. వీకెండ్ లో వీరి జలకాలాటలు కెమెరా కళ్ళకు చిక్కాయి. ఈ సిటీలో దీన్ని ‘మాయా బీచ్ వాటర్ పార్క్’ అని వ్యవహరిస్తారట. స్విమ్ సూట్లు, గాగుల్స్ ధరించిన అనేకమంది ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ ని ఆస్వాదించారు. కొందరు వాటర్ జెట్ బోర్డుపై విన్యాసాలు చేస్తూ వినోదం అందించారు. కొంతమంది రబ్బర్ డింగీల్లో కేరింతలు కొట్టారు. కరోనా వైరస్ నేపథ్యంలో 76 రోజుల లాక్ డౌన్ అనంతరం గత జూన్ లో మళ్ళీ ఈ వాటర్ పార్క్ ను ప్రభుత్వం ప్రారంభించింది. లోకల్ ఎకానమీని ప్రోత్సహించేందుకు హుబె ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 400 టూరిస్ట్ సైట్ లకు ఉచిత ఎంట్రీ సౌకర్యాన్ని కల్పించింది.
కరోనా వైరస్ కేసులను చాలావరకు నియంత్రించిన చైనా మళ్ళీ ఇలాంటి వినోద కాలక్షేపాన్ని కలిగిస్తోంది.