Sri Sri: తెలుగు సినిమా పాటలకు కొత్త నడకలు నేర్పిన శ్రీశ్రీ, పాటకు ఆయన కట్టబెట్టిన గౌరవం అనంతం

సినీ గీతాలకు కొత్త నడకలు నేర్పారు. పాటలో ప్రణయరాగాలు పలికించారు. ప్రళయ గర్జనలు పుట్టించారు. ప్రణయ మాధుర్యాన్ని దట్టించారు. హాస్యాన్ని తొణికించారు. ఆయన్నే మహాకవి శ్రీశ్రీ.

Sri Sri: తెలుగు సినిమా పాటలకు కొత్త నడకలు నేర్పిన శ్రీశ్రీ, పాటకు ఆయన కట్టబెట్టిన గౌరవం అనంతం
Telugu Poet And Writer Sri Sri
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 30, 2021 | 3:38 PM

Telugu poet and writer Mahkavi Sri Sri: ఇవాళ మహాకవి శ్రీశ్రీ జయంతి. ఆయన తెలుగు సాహిత్యానికే కాదు. సినీ గీతాలకు కొత్త నడకలు నేర్పారు. పాటలో ప్రణయరాగాలు పలికించారు. ప్రళయ గర్జనలు పుట్టించారు. ప్రణయ మాధుర్యాన్ని దట్టించారు. హాస్యాన్ని తొణికించారు. శృంగారాన్ని ఒలికించారు. నిప్పులురిమే ఉద్యమ గీతాలను, ఉత్తేజాన్ని నింపే దేశభక్తి పాటలూ రాశారు. ఒక్క మాటలో చెప్పాలంటే నవరసాలతో పాటను పరవళ్లు తొక్కించారు. శ్రీశ్రీ పాట ఎలా వుంటుందంటే ఏం చెప్పగలం? ఆయన పాట జలపాతం. వర్షుకాభ్రముల ప్రళయ ఘోష. కలకత్తా కాళిక. కాళికాదేవి నాలిక. కత్తిమొన మీద నెత్తుటి చుక్క. కొడవలి. మరఫిరంగి. మందుపాతర. హేమంత సమీరం. తుషార శీతలం. వెచ్చని నీడ. పచ్చని పైరు. శ్రీరంగం శ్రీనివాసరావు జయంతి రోజు ఏ మహాప్రస్థానాన్నో, ఏ ఖడ్గసృష్టినో ప్రస్తావించకుండా పాటల ప్రస్థానమేమిటా అని అనుకోకండి. ఆయన బహుముఖ ప్రజ్ఞలో సినిమా సాహిత్యం ఓ పార్శ్వమే కావొచ్చుగాక కానీ పాటకు ఆయన కట్టబెట్టిన గౌరవం మాత్రం అనంతం. నిజానికి సినిమా పాట రాయడం చాలా మంది అజ్ఞానులనుకొనేటంత తేలిక కాదనేవారు శ్రీశ్రీ. పాటల్లేని సినిమా ఉప్పులేని పప్పులా చప్పగా వుంటుందనేవారు. రాసినవి తక్కువే అయినా వాసిగల సినిమా పాటల్నే రాశారాయన! దిగజారుడు సినిమాలకు రాయాల్సి వచ్చినా శ్రీశ్రీ కలం మాత్రం ఎప్పుడూ దిగజారలేదు.

శ్రీశ్రీ సినిమా పాటలు రాయడమేమిటి తప్పు తప్పు అని అప్పుడప్పుడు కొంత మంది నోరు పారేసుకున్నా, నొసలు చిట్లించినా సినిమాకు శ్రీశ్రీ ఓ వరం. ఆయన బహుముఖ ప్రజ్ఞలో సినిమా సాహిత్యం ఓ కోణమే అయినా…పాటకు ఆయన కట్టపెట్టిన గౌరవం మాత్రం అనంతం..ఆహుతి అనే డబ్బింగ్‌ చిత్రంలో సినీ రంగంలో అడుగు పెట్టినా అంతకు ముందెప్పుడో వచ్చిన కాలచక్రం అనే సినిమాలో మహా ప్రస్థానాన్ని వాడుకున్నారు.డబ్బింగ్‌ పాటల్లో ఆయనెక్కువగా సంస్కృత సమాసాలనే వాడారు. నిజానికి అవి ఆయన సొంత పదాలై వుండవు. డబ్బింగ్‌ కాబట్టి పెదాల కలయిక ప్రాధాన్యం కాబట్టి అలా రాసివుంటారు. ఆహుతి సినిమా కోసం ఆయన రాసిన మొదటి పాట ప్రేమయే జనన మరణలీల అన్న పాటనే చూడండి. మృత్యుపాశం, అమరబంధం, యువ ప్రాణులు, హృదయ సదనం, సుకృత జన్మం, మధుర మధురతనం ఇలా వుంటాయి పదాలు. తర్వాతి కాలంలో డబ్బింగ్‌ పాటల్లోనూ సాహిత్యం పరిమళించేలా చూసుకున్నారు. అసలు అనువాద చిత్రాలకు ఆద్యుడు శ్రీశ్రీనే! హిందీ, తమిళ భాషల నుంచి దిగుమతి అయ్యే ప్రతీ సినిమాకు శ్రీశ్రీ కలమే కావాల్సి వచ్చేది. డబ్బింగ్‌ చిత్రాలకు ఎలా రాయాలో సూత్రీకరించింది శ్రీశ్రీనే! ఓష్ట్యాలైన ప ఫ బ భ మల విషయంలో జాగ్రత్తపాటించాలని తర్వాతి కవులకు సలహా ఇచ్చింది కూడా ఆయనే!

దిగజారుడు సినిమాలకు రాయాల్సి వచ్చినా, ఆ కలం మాత్రం దిగజారకుండా ప్రజా పోరాటాలను, సామ్యావాదాన్ని, సామాజిక స్పృహను పలికించింది. పరిశ్రమలో నిలదొక్కుకోవడం కోసమేమో చెవిలో రహస్యం అనే తమిళ డబ్బింగ్‌ సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు శ్రీశ్రీ. తర్వాత లెంపలేసుకున్నారు. మళ్లీ నిర్మాణం జోలికెళ్లలేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ సినిమాలో గుణవంతులు,ధనవంతులు భగవంతుని సాక్షిగా ధనహీనుల కష్టాలను తొలగించుట ధర్మము అనే ఓ పాటరాశారు.. అదే భావాన్ని మళ్లీ వెలుగునీడలు సినిమాలో ఓ రంగయో పూల రంగయో పాటలో వినిపించారు. పెట్టుబడిదారి వ్యవస్థపై, సామ్రాజ్యవాద శక్తులపై ఆవేశాన్ని ఆక్రోశాన్ని అసహ్యాన్ని ఆయన పాటల్లో ప్రస్ఫుటింపచేశారు. సినీ రంగంలో వుంటూ సినిమాలకు పాటలూ రాస్తూ ఆ పాటలన్నిటి పుట్టుకా పెద్ద ఫార్స్‌ అంటూ చెప్పుకోగలగటం శ్రీశ్రీకే చెల్లింది. అది ఆయనలోని నిక్కమైన నిజాయితీగా నిదర్శనం. అయితే ఫార్స్‌ అంటూనే ఏ పాటనూ ఆయన తేలిగ్గా తీసుకోలేదు. ఆషామాషీగా రాయలేదు. ప్రతిదానికి కష్టపడ్డాడు. ప్రతిదాన్ని ఇష్టపడ్డాడు. సినిమా పాటల్లో వ్యక్తమైన భావాలు చాలా వరకు తనవి కావని డబ్బిచ్చి రాయించుకున్న నిర్మాతలవనీ, వాళ్లు కోరినవే తానే రాసిపెట్టాననీ శ్రీశ్రీ చెప్పుకున్నా చాలా పాటల్లో ఆయన అభిప్రాయం స్పష్టంగా వినిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆయన పాట మర ఫిరంగిలా పేలుతుంది. ఇంతేసి గంధకాన్ని, ఇంతేసి సూరేకారాన్ని నూరే శ్రీశ్రీనే వీణ పాటల ఒరవడికి నాంది పలికారన్న విషయం చాలా మందికి తెలియని సత్యం. భార్యభర్తలు సినిమాలోని ఏమని పాడెదనో ఈ వేళ పాట విని చూడండి. వీణ పాటలోని మాధుర్యమెలా ఉంటుందో అనుభవం అవుతుంది. అప్పట్లో డబ్బింగ్‌ చిత్రాలతో బిజీగా వున్న శ్రీశ్రీ దుక్కిపాటి కోసమే ప్రత్యేకంగా మాంగల్యబలంలో అయిదు పాటలు రాశారు. అయిదూ ఆణిముత్యాలే. సన్నివేశాన్ని వివరించి పిల్లలకు పనికొచ్చేలా ఓ పాటరాయమన్నాడు దుక్కిపాటి. పెద్దవాళ్లకూ పనికొచ్చేట్టటు రాస్తానంటూ హాయిగా ఆలూ మగలై కాలం గడపాలి అన్న పాట రాశారు శ్రీశ్రీ. ఇందులో తలగడ మంత్రం అంటూ శ్రీశ్రీ వేసిన పదానికి చేసిన చమత్కారానికి సాటి కవులంతా చాటుగా తెగ మెచ్చేసుకున్నారు. శ్రీశ్రీ కలం పడితే పదాలు క్యూలో నిల్చోవాలే కానీ…ఆయన ఏనాడు శబ్దాల కోసం తల బద్దలు కొట్టుకోలేదు. కలం జోరుగా హుషారుగా సాగిపోయేది. పాటా అంతే. భార్యభర్తలు సినిమాలోని జోరుగా హుషారుగా పాటలాగే!

శ్రీశ్రీ అన్ని రకాల పాటలు రాశారు. నవరసాలను ఒలికించారు. వైరాగ్యమూ రాశారు. వేదాంతాన్ని రాశారు. రెండింటిని కలగలిపి కషాయం తయారుచేస్తే దాని ఘాటుకి దేవుడే ఉక్కిరిబిక్కిరయ్యేంతగా రాశారు. దేవత సినిమాలోని బొమ్మను చేసి ప్రాణము పోసి అన్న పాటకు నిజంగానే దేవుడు ఉక్కిరిబిక్కిరి అయ్యే ఉంటాడు. ఇందులోనే కాదు, శోక రసాన్ని చాలా అద్భుతంగా చాలా పాటల్లో చూపించారు. అల్పాక్షరాలలో అనల్పార్థం కుప్పించారు. మాంగల్యబలంలోని పెను చీకటాయేలోకం చెలరేగేనాలో శోకం అన్న పాటు ఇందుకు మంచి ఉదాహరణ. భవిష్యత్తరాలను దృష్టిలో పెట్టుకుంటే ..శ్రీశ్రీ సినిమా పాటకు ఆయుర్దాయం ఇన్ఫినిటి టు ది పవర్‌ ఆఫ్‌ ఇన్ఫినిటి క్రాంతి సంవత్సరాలు…తెలుగు సినిమా సాహిత్యంలో చెరగని ఎరా…తరగని సిరా శ్రీశ్రీ. మనిషన్నవాడు వున్నంత కాలం ఆయన పాటలు అక్షరాలై నిత్యమూ నిలుస్తాయి. శృంగారమని అనలేం కానీ..ప్రణయగీతాల్లో శ్రీశ్రీ కొత్త ఒరవడి సృష్టించారు. నర్తనశాలలోని ఎవ్వరి కోసం ఈ మందహాసం పాట విని చూడండి. నిజమే సుమా అని గ్యారంటీగా అనుకుంటారు. అన్నట్టు నరుడైనా నారాయణుడైనా వలపు చిలికే భార్యామణి నగుమోమును చూసి మురిసిపోవలసిందే కదా! ప్రణయారాధన వేళ పతి సేవలు అవసరమా చెప్పండి? ఇలాంటి అనుమానం కలిగే శ్రీకృష్ణ తులాభారంలో ఓహో మోహనరూప అన్న పాట రాశారు శ్రీశ్రీ. ఒ కారాలను విరివిగా ప్రయోగించడంలో శ్రీశ్రీకో ప్రత్యేకత వుంది. ఒ కారాలను ప్రయోగిస్తూ ఓహో మేఘ సఖా ఒక చోట ఆగేవో అంటూ ఓ డబ్బింగ్‌ పాటకు రాసిన శ్రీశ్రీ మళ్లీ అలాంటి ప్రయోగమే వెలుగునీడలు సినిమాలోని హాయి హియిగ జాబిల్లి తొలి రేయి వెండిదారాలల్లి పాటలోనూ చేశారు. అన్నట్లు జాబిల్లి కిరణాలను వెండిదారాలతో పోల్చడం ఎంత మంచి ప్రయోగం! డాక్టర్‌ చక్రవర్తి సినిమాలోని మనసున మనసై బ్రతుకున బ్రతుకై పాటను అప్పట్లో ప్రతి తెలుగుపిల్లా ఇల్లంతా తిరుగుతూ మురిపంగా పాడుకుంటూ మురిసిపోయింది.

జాతిని మెల్కొలిపే పాటలే కాదు, మేల్కొన్న జాతిని ముందుకు నడిపించే సమరగీతాలు కూడా అనేకం రాశాడాయన.. శబ్దం భావావేశాన్ని కల్పించే రచనాశిల్పం శ్రీశ్రీది! తర్వాత ఆయన్ను చాలా మంది అనుసరించారు..అనుకరించారు. నిజంగా నేను ప్రజల కవిని. ఎంచేతంటేను వాళ్లను చదివేను..చదివిందే రాసేను అనేవారు శ్రీశ్రీ..మానవుడంటే శ్రీశ్రీకి వల్లమాలిన అభిమానం. మనుషులు మారాలి సినిమాలోని తూరుపు సిందూరపు అన్న పాటలో జాగ్రత్తగా విన్నారా? మామూలు పుట్టిన రోజు పాటను మానవజాతి ఆవిర్భావాన్ని కీర్తించే స్థాయికి చేర్చడం మనిషిపై..అతని సామర్థ్యంపై శ్రీశ్రీకున్న నమ్మకానికి నిదర్శనం. ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన వాగ్దానంలో శ్రీశ్రీ ఓ పాటలో ఎవరో వచ్చి సాయం చేస్తారనుకోవటమే పొరపాటు అని అంటారు…అదే పాటను కాస్త మార్చి భూమికోసం సినిమాలో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా అని మళ్లీ ప్రయోగించారు. అప్పట్లో శ్రీశ్రీ రోజుకు రెండు మూడు పాటలు అవలీలగా రాసేసేవారు. కానీ వెలుగునీడలు సినిమాలోని పాడవోయి భారతీయుడా పాటను రాయడానికి మాత్రం పక్షం రోజులు పట్టింది. ఆయనకు అఖండ కీర్తి ప్రతిష్టలను తెచ్చింది. ఎప్పుడు పాడుకున్నా…ఇవాళే స్పందించి రాసినట్టుగా నిత్యనూతనంగా వుంటుంది. తెలుగు పాటకు జాతీయ స్థాయిలో గౌరవాన్ని తీసుకొచ్చింది శ్రీశ్రీనే! అంతకు ముందు పాటకు అవార్డు ఇవ్వడమనేది లేదు. అల్లూరి సీతారామరాజు సినిమాలోని తెలుగువీర లేవరా పాటతోనే ఆ సంప్రదాయం మొదలైంది…స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ రగిలించిన పాట అది…వింటుంటే ఒళ్లు గగుర్పాటు కలుగుతుంది..రోమాంచితమవుతుంది…అప్రయత్నంగా పిడికిళ్లు బిగుసుకుంటాయి.. ఇదీ శ్రీశ్రీ పేరులోనూ కలంలోనూ వున్న వైబ్రేషన్. శ్రీశ్రీ దేశభక్తి పాటలు, జాతిని చైతన్యపరిచే గీతికలు ఎన్నో రాశారు. బలిపీఠం సినిమాలో కలిసిపాడుదాం తెలుగుపాట, రాముడు భీముడులోఉందిలే మంచికాలం ముందుముందునా, నేటిభారతంలో అర్ధరాత్రి స్వతంత్రం అంధకారబంధురం పాటలు కొన్ని ఉదాహరణలు.

కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగిస్తే శ్రీశ్రీలా వెలిగిందన్నాడు పురిపండ. నిజమే ఆయన ఓ శతాబ్దపు మహాకవిగా ఓ వెలుగు వెలిగారు. ఆయన పాటా వెలిగింది. వెలుగుతూ వుంది..సినీ సాహిత్యంలో ఆయన స్పృశించని ప్రక్రియ లేదు.. బొబ్బిలియుద్ధం సినిమాకు ఓ జావళి అవసరమైంది. నేను రాస్తానన్నారు శ్రీశ్రీ…మీరు రాయగలరా అని ప్రశ్నించారు సాలూరి మాస్టారు..గలనో లేనో చూడండి అంటూ నిమిషాల్లో నిను చేర మనసాయరా పాట రాసి అనుమానపడ్డవాళ్ల ముక్కున వేలేయించారు. వ్యక్తిత్వ వికాసానికి బండెడు పుస్తకాలు చదవనక్కర్లేదు…గంటల కొద్ది ప్రసంగాలు విననక్కర్లేదు.. కేవలం వెలుగు నీడలు సినిమాలోని కలకానిది విలువైనది బతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అన్న ఒక్క పాట వింటే చాలు… ఈ పాట విన్నాకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఒకతను తన మనసు మార్చుకున్నాడట! పాట ప్రభావం అలాంటిది. లైఫ్‌ ఈజ్‌ నాట్‌ ఏ డ్రీమ్‌ అని వివేకానందుడు చెప్పిన మాట ఈ పాటకు ప్రేరణ అనే వాళ్లున్నారు. అగాధమౌ జలనిధిలోన అని ఖలీల్‌ జీబ్రాన్‌ ఏనాడో అనేశారని చెప్పినవాళ్లూ వున్నారు. శ్రీశ్రీ మాత్రం ఉడుమలై నారాయణ కవి రాసిన చరణాలలోంచి చరణాన్ని తీసుకున్నానని నిజాయితీగా చెప్పుకున్నారు. నాస్తికుడైనా శ్రీశ్రీ భక్తి పాటలూ రాశారు. వృత్తి ధర్మం కొద్ది వాటికీ న్యాయం చేశారు. వీరరసాన్ని శ్రీశ్రీ పలికించినంతగా మరే రచయిత పలికించలేదు..పలికించలేడు కూడా. ఎందుకంటే అది శ్రీశ్రీ సొత్తు కాబట్టి. కురుక్షేత్రం సినిమాలో ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం పాట, యమగోలలోని సమరానికి నేడే ప్రారంభం పాట వింటే వీరరసంలోని పవరేమిటో తెలుస్తుంది. ఒక సినిమా మొత్తం ఒక కవి చుట్టూ తిరగడమనేది చాలా గొప్ప విషయం. ఆ ఘనత ఒక్క శ్రీశ్రీకే దక్కింది. ఆకలిరాజ్యం సినిమా మొత్తంగా శ్రీశ్రీయే వినిపిస్తాడు. శ్రీశ్రీ కలలు కన్న సామ్యవాదమే కథావస్తువైన ఇందులో హీరో మహాప్రస్థానం కవితలనే పలుకుతుంటాడు. సినిమా రచయితగా శ్రీశ్రీ ప్రస్తావన తెచ్చాం కాబట్టి.. ఆయన కాసేపు కనబడిన సినిమాలనూ చెప్పుకుందాం. 1950లో వచ్చిన ప్రపంచంలో శ్రీశ్రీ కాసేపు కనిపిస్తారు. ఆ తర్వాత చాలా కాలానికి జి.వరలక్ష్మి నిర్మించి దర్శకత్వం వహించిన మూగజీవులు అనే సినిమాలో కొంత మంది కవులతో పాటు కనిపిస్తారు.. ఇక మాదాల రంగారావు నిర్మించిన మహాప్రస్థానంలో పెళ్లిపెద్దగా దర్శనమిస్తారు శ్రీశ్రీ. శ్రీశ్రీ ఓ మహోన్నత శిఖరం. ఉవ్వెత్తున లేచిన కడలి తరంగం…వందలకొద్దీ పాటల్లో మెచ్చినవి వెతకడం అసాధ్యం…అసలు ఆయన గురించి చెప్పడానికి తెలుగు భాషలో అక్షరమాల సరిపోదు. కొత్త అక్షరాలను వెతుక్కోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా పాటలకు ఆయాచిత వరం. అది మన అదృష్టం.

Read Also… కళ్లు మసక మసకగా కనిపిస్తున్నాయా..? చూపు మందగించిందా..! అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో