దేశవ్యాప్తంగా కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రపంచ వ్యాప్త డ్రగ్స్ కంపెనీలతో పాటు భారత్‌కు చెందిన పలు ఔషధ సంస్థలు చేస్తున్న ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ అభివృద్ధి చేసిన ఈ టీకాను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వచ్చే వారంలో విడుదల చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫైజర్, గ్లాక్సోస్మిత్‌క్లైన్ నిమోనియా వ్యాక్సిన్ల కంటే ఇది చవకగా లభించనుందంటున్నారు సంస్థ ప్రతినిధులు.
అయితే, సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ‘నిమోకోకల్ పాలిసాకరైడ్ కంజ్యుగేట్ వ్యాక్సిన్’ మూడు దశల క్లినికల్ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకుంది. దీంతో గత జులైలోనే భారత ఔషధ నియంత్రణ సంస్థ ఈ టీకా విక్రయాలకు అనుమతి ఇచ్చింది. ‘‘శిశువుల్లో స్ట్రెప్టోకోకస్ నిమోనియా కారణంగా తలెత్తే శ్వాసకోశ సమస్యలను అధిగమించేలా వారిలో రోగ నిరోధకతను పెంపొందించేందుకు సీరం టీకా ఉపయోగపడుతుందంటున్నారు. భారత్‌లో తయారీ కార్యక్రమంలో ఇదో పెద్ద ముందడుగు’’ అని సీరం సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదిలావుంటే, యునిసెఫ్ గణాంకాల ప్రకారం- భారత్‌లో ఏటా లక్ష మందికిపైగా ఐదేళ్లలోపు చిన్నారులు నిమోనియా కారక వ్యాధులతో మృతిచెందుతున్నారు. కరోనా మహమ్మారి నెలకొన్న తరుణంలో సీరం వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండటం శుభపరిణామమని నిపుణులు భావిస్తున్నారు. దేశీయ నిమోనియా టీకా అనుమతులు పొందిన క్రమంలో… సీరం ఇన్‌స్టిట్యూట్‌లోని ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల అదనపు సంచాలకులు ప్రకాశ్‌కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్యమంత్రికి లేఖ రాశారు. ‘‘ప్రధాని మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్ పిలుపును అందుకుని లాక్‌డౌన్ సమయంలో మరో చరిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాం. ప్రపంచ స్థాయి పీసీవీ వ్యాక్సిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేశాం. దీనికి అనుమతులు కూడా వచ్చాయి’’ అని ఆయన వెల్లడించారు. త్వరలో అందరికీ అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు.