చట్టాలు ఎన్ని వచ్చిన ఆడపడుచులకు అండగా నిలవలేకపోతున్నాయి. వరకట్న దాహాగ్నిలో అబలలు ఆహుతులవుతూనే ఉన్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో నవ వధువు వరకట్న పిశాచానికి బలైంది. కేతెపల్లి మండలం కొర్లపహాడ్‌లో దారుణం జరిగింది. కట్నం వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని రోజుల క్రితమే సూర్యాపేటకు చెందిన చర్చి కాంపౌండ్ ప్రణయ్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత వారి సంసారం కొన్ని రోజులు సాఫీగా సాగింది. అంతలోనే ఆమె భర్తకు కట్నం మీద యావ పుట్టింది. పుట్టింటి నుంచి కట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేసాడు. మానసికంగా, శారీరకంగా హింసించడంతో.. భరించలేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.