Telangana: మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి పాటిపెట్టిన గ్రామస్థులు
ఓ వైపు దేశం సాంకేతిక యుగంలో దూసుకుపోతున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా మూడనమ్మకాలని నమ్మి దారుణాలకు పాల్పడుతున్నారు జనాలు. తాజాగా మాత్రల నెపంతో ఇద్దరు వృద్ధులను అతి దారుణంగా హత్య చేసి పాటి పెట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వృద్ధులను అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హత్య చేసి, మృతదేహాలను అడవిలో పాతిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గత నెల రోజులుగా ఇద్దరు వృద్ధులు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారిద్దరినీ హత్య చేసి పాతిపెట్టినట్లు గుర్తించడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. మణుగూరు మండలం బుడుగులకు చెందిన మాసయ్య, ఆళ్లపల్లి మండలం భూసురాయి గ్రామానికి చెందిన భీమయ్య ఇద్దరూ బంధువులు. నెల రోజుల క్రితం మాసయ్య మనవరాలి ఆరోగ్యం క్షీణించడంతో భీమయ్య అక్కడికి వచ్చి పూజలు నిర్వహించాడు. అనంతరం మరోసారి పూజలు చేసేందుకు భూసురాయికి వెళ్తున్న క్రమంలో మాసయ్య, భీమయ్యలను బుడుగులకు చెందిన కొందరు వ్యక్తులు హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై భీమయ్య కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో ఇద్దరు వృద్ధుల హత్యకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుడుగుల గ్రామంలో భీమయ్య, మాసయ్యలు మంత్రాలు చేస్తూ స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొందరు గ్రామస్థులు అనుమానించినట్లు పోలీసులు తెలిపారు. వారు నిర్వహించే పూజల కారణంగానే గ్రామంలో పలువురు మరణిస్తున్నారనే అపోహతో కొందరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడించారు.
నెల రోజుల క్రితం ఇద్దరు వృద్ధులను కర్రలతో కొట్టి హత్య చేసి, అడవిలోని ఓ చెక్‌డ్యామ్ సమీపంలో మృతదేహాలను పాతిపెట్టినట్లు మణుగూరు సీఐ నాగబాబు వివరించారు. ఈ హత్యల్లో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తించామని సీఐ తెలిపారు. రెండు హత్యలకు సంబంధించి విచారణ కొనసాగుతోందని, మంత్రాలు చేస్తున్నారనే నెపంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించామని పేర్కొన్నారు. హత్యలకు పాల్పడిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
