
తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతున్నదని, జాతీయ జియస్ డిపి సగటుతో పోల్చుకుంటే తెలంగాణ 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, గనులశాఖా మంత్రి కేటీ రామారావు అన్నారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా గత ఏడాది నమోదైన 4.55 శాతంతో పోలిస్తే 2019- 20 సంవత్సరానికి 4.76 శాతంగా ఉందన్నారు. ఇక జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో తెలంగాణ వాటాను 35 శాతం ఉందని స్ఫష్టం చేశారు కేటీఆర్.
హైదరాబాద్ ప్రగతి భవన్ లో రాష్ట్ర పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్ తో కలిసి మంత్రి కేటీఆర్ రాష్ట్ర పరిశ్రమల వార్షిక నివేదికను విడుదల చేశారు. దేశ సగటు ఆదాయం 1,34,432 రూపాయలతో పోల్చితే తెలంగాణ పర్ క్యాపిటల్ ఆదాయం 2,28,216 రూపాయలుగా పేర్కోన్నారు. ఇప్పటి దాకా టియస్ ఐపాస్ ద్వారా మొత్తం 1,96,404 కోట్లరూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. భారతదేశంలోనే అత్యధికంగా నెట్ ఆఫీస్ అబ్ సార్ ప్షన్ (absorption) విషయంలో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదన్నారు. ఇప్పటిదాకా అనుమతులు పొందిన 12,021 పరిశ్రమల్లో 75 శాతానికి పైగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తున్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందన్నారు. ఇలా తెలంగాణ ముందుండడానికి పరిశ్రమల స్థాపన ఎంతో దోహదం చేసిందన్నారు.