AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సీఎం జగన్‌తో మాకు మంచి సంబంధాలు: కేటీఆర్‌

ఏపీ సీఎం జగన్‌తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమన్నారు.

ఏపీ సీఎం జగన్‌తో మాకు మంచి సంబంధాలు: కేటీఆర్‌
Balaraju Goud
|

Updated on: Aug 09, 2020 | 5:53 PM

Share

Minister ktr session in twitter : ఏపీ సీఎం జగన్‌తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమన్నారు. కేసీఆర్‌ తర్వాత తనకు ఇష్టమైన లీడర్‌ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అని చెప్పారు. ఆస్క్‌ మీ పేరుతో ట్విట్టర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను ప్రజలు కేటీఆర్‌ దృష్టికి తీసుకురాగా.. ఆయన ఆయా శాఖలను అప్రమత్తం చేశారు.

కరోనా కాలంలో ప్రైవేట్‌ ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు. ఇప్పటికే కొన్నింటిపై చర్యలు తీసుకున్నామని, మరికొన్నింటిపై చర్యలు తీసుకుంటామన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పించామని వివరించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి చికిత్స అందిస్తున్నందున ప్రజలు ఆ సేవలను వినియోగించుకోవాలని కేటీఆర్‌ కోరారు. ప్రస్తుతం రోజుకు 23వేల కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలను చేస్తున్నామన్నారు. త్వరలోనే ఈ సంఖ్యను 40వేలకు పెంచుతామని పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ మెరుగైన పథకమని చెప్పారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఎంతో విలువైన సేవలను అందిస్తున్నారని అభినందించారు. కరోనాకు మొదటి వ్యాక్సిన్‌ తెలంగాణ నుంచే వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం కొత్తగా 5 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు మంత్రి. అన్ని ఏరియా ఆస్పతుల్లో ఐసీయూ యూనిట్స్‌ మొదలుపెట్టామని, ఉచితంగా డయాలసిస్‌ కూడా నిర్వహిస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఒక్క రాజధానిలోనే 200 బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేశామన్నారు.

ఇతర దేశాల నుంచి వచ్చినా సంతోషమేనన్నారు. ప్రజా రవాణా తిరిగి ప్రారంభించే విషయంలో కేంద్రం అనుమతి కోసం వేచి చూస్తున్నామని వెల్లడించారు. కరోనా పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిక లేదని స్పష్టం చేశారు. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. టీఎస్‌ బీపాస్‌ పట్టణ సంస్కరణల్లో బెంచ్‌ మార్క్‌గా నిలుస్తుందన్నారు. ఎక్కువ సీసీటీవీ కెమెరాలు ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి కావడం గర్వకారణమని చెప్పారు. నేరాల నియంత్రణకు కెమెరాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నెల మూడో వారంలో దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

Also Read: షాకింగ్‌ న్యూస్‌.. కరోనాతో కోలుకున్నా ఆ ముప్పు తప్పదట