తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు అధికవమవుతోంది. ఇప్పటివరకు రోజుకు ఇన్ని కేసులు అన్ని లెక్కబెట్టింది కాస్తా..ఇప్పడు గంటలకు విస్తరించింది. ఇప్పటివరకు తెలంగాణలో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఇప్పటికవరకు కొత్తగా ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్య శాఖ నిర్దారించింది. ఇటీవల లండన్ నుంచి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి, జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల మహిళకు, సౌదీ నుంచి తిరిగివచ్చిన 61 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ప్రజలు..ప్రభుత్వాలు, పోలీసులు మాట వినడం లేదు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు మొదలెట్టింది.
లాక్ డౌన్ ను సీరియస్ గా అమలు చేయడంతో పాటు..మరోకొన్ని ప్రత్యేక చర్యలకు సిద్దమైంది. రాష్ట్రంలో జ్వరం బారిన పడిన ప్రతి వ్యక్తికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కరోనా మూడో దశకు చేరుకునే ప్రమాద ఘంటికలు దగ్గరపడిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు మరింత అప్రమత్తంగా ఉండాలని డిసైడయ్యింది. ఏ ఎన్ ఎంలు, ఆశా వర్కర్ల సాయంతో కరోనా లక్షణాలు ఉన్నవారిని ఇటింటికి వెళ్లి చర్యలు చేపట్టేందుకు సిద్దమవుతోంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు కనిపిస్తే వీరు వెంటనే ప్రభుత్వానికి సమాచారం చేరవేయనున్నారు.