తెలంగాణ ప్రభుత్వం జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే ఈ నెల 11వ తేదీ రెండో శనివారం పాఠశాలలకు సెలవు ఉండదని తాజాగా విద్యాశాఖ కమీషనర్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా దసరా సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతి నెల రెండో శనివారం పని దినంగా గతంలోనే విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 11న పాఠశాలలు యథాతధంగా పని చేయనున్నట్లు విజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఇక విద్యాశాఖ కమీషనర్ ఇచ్చిన ఉత్తర్వులకు ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. చాలామంది టీచర్లు ప్రయాణాలు చేసేందుకు రిజర్వేషన్లు 11వ తేదీనే చేసుకున్నారని.. ఇలాంటి సమయంలో తిరిగి పాఠశాలకు వెళ్లాలనడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఒకసారి ఈ నిర్ణయంపై మరోసారి సమీక్షించాలని యూటీఎఫ్ కోరింది.