
తెలంగాణ: సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించారు. ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 102 పరీక్షా కేంద్రాల్లో ఇంజినీరింగ్ ఎంసెట్ పరీక్ష జరగనుంది. కరోనా లక్షణాలు లేనివారినే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని.. ఇందులో భాగంగానే అన్ని సెంటర్ల వద్దా థర్మల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.(Telangana Eamcet On September 9)
అంతేకాకుండా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమకు కరోనా లేదని సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు. ఎంసెట్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ ఫామ్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అటు హల్ టికెట్లపై ఇన్విజిలేటర్ల సమక్షంలో విద్యార్థులు సంతకం చేయాలన్నారు. ఇక కరోనా బారిన పడ్డ అభ్యర్థులు ముందుగా సమాచారమిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారులు సూచనల మేరకు పరీక్షలు జరుపుతామన్నారు. అంతేకాకుండా విద్యార్థులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని.. వారితో పాటు ఓ వాటర్ బాటిల్‌ను, 50ఎంఎల్ శానిటైజర్ బాటిల్‌ను అనుమతిస్తామన్నారు. కాగా, గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ఎంసెట్ ఫలితాలు అక్టోబర్ మొదటివారంలోనే విడుదల చేసేలా చర్యలు చేపడతామని కన్వీనర్ ఆచార్య గోవర్ధన్ అన్నారు.