
దేశంలో కొండెక్కి కూర్చున్న ఉల్లిపాయల ధరలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కేంద్రాన్ని దుయ్యబట్టారు. బీహార్ ఎన్నికలకు మరో రెండు రోజులే ఉండగా ఆయన సోమవారం బీజేపీని దుమ్మెత్తిపోశారు. ఉల్లిగడ్డల దండలేసుకుని ఆ పార్టీ నేతలు తిరుగుతున్నారని, వీటిని తామిప్పుడు ఓటర్లకు ఇస్తున్నామని ఆయన అన్నారు. తనతో బాటు మరో నాయకుడు పట్టుకున్న ఉల్లిదండల ఫోటోలను ఆయన షేర్ చేశారు. ఆనియన్స్ కేజీ 50 నుంచి 60 రూపాయలు ఉండగా… ఆ మాటే ఎత్తని బీజేపీ నాయకులు ఇప్పుడు కేజీ 80 రూపాయల నుంచి సుమారు వంద రూపాయలవరకు పెరిగిపోతే నోరెత్తడం లేదన్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, జాబ్స్ లేక యువత అల్లాడుతున్నారని, తాము పండించిన పంటలకు దిగుబడి సొమ్ము రాక రైతులు నానా కష్టాలు పడుతున్నారని తేజస్వి యాదవ్ కేంద్రంపై నిప్పులు కక్కారు.