నేను బాగా ఆడతానని నన్ను కిడ్నాప్ చేశారని షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన టీనేజ్ గురించి చెప్పుకొచ్చాడు. క్రికెట్ వల్ల తాను చిన్నప్పటి నుంచే ఎన్నో సమస్యలు ఎదుర్కోవల్సి వచ్చిందని పేర్కొన్నాడు. నేను కిడ్నాప్ అవుతున్న విషయం కూడా నాకు తెలీదని, అంత తెలివిగా చేశారని నవ్వుతూ చెప్పాడు.
‘నా చిన్నప్పుడు ఇంటి వద్దే రోడ్ల మీద ఫ్రెండ్స్‌తో క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్లం. ఇలా ఆడటం మా నాన్నకు ఏమాత్రం నచ్చేది కాదు. కానీ ఆ తరువాత నన్ను అర్థం చేసుకున్నారు. అలా ఒకానొక రోజు మా టీం ప్రత్యర్థి జట్టుతో ఫైనల్ మ్యాచ్ ఆడాలి. నేను ఇంటి నుంచి హడావిడిగా బయలు దేరాను. ఇంతలో ఓ నలుగురు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మీద వచ్చారు. పద మనం వెళ్లాలి అన్నారు. నాకు డౌట్ వచ్చి మీరెవరు? అని అడిగాను. దానికి సమాధానంగా వారు నువ్విక్కడ మ్యాచ్ ఆడుతున్నావంట కదా.. అందుకే తీసుకువెళ్లడానికి వచ్చామన్నారు. ఇది విన్న నేను అబ్బో.. నాకోసం బండి పంపించారా? అంటూ సంబరపడి బండి ఎక్కాను.
కొంచెం ముందుకు వెళ్లాక ఓ టీ షాపు ముందు ఆపి.. నాకు బజ్జీలు, వడలు కొనిపెట్టారు. అలా మాట్లాడుకుంటూనే.. మ్యాచ్ టైం అయ్యింది. దీంతో వారిని నేను కంగారు పెట్టగా.. మెల్లగా అసలు విషయం బయటపెట్టారు. అలాగే.. ఈ మ్యాచ్ ఆడితే నీ చేతి వేళ్లు కట్ చేస్తామని బెదిరించారు. దాంతో ఇంక నేను సైలెంట్‌గా అక్కడే కూర్చొన్నా. మ్యాచ్ టైం అయిపోయాక.. నన్ను ఇంటి ముందు దిగబెట్టేశారు. మా ప్రత్యర్థి టీం వాళ్లే ఈ పని చేశారు. అలా క్రికెట్ కోసం చిన్నప్పుడే నన్ను కిడ్నాప్’ చేశారని.. సరదా సంఘటనను గుర్తు చేసుకున్నాడు అశ్విన్.