ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చెందిన నలుగురు విద్యార్థులపై యాజమాన్యం సస్పెన్షన్ ఎత్తివేసింది. ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేయడంతో మొదట వారిపై వేటు వేశారు. అయితే పలు ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు నుంచి విమర్శలు రావడంతో..యాజమాన్యం వెనకడుగు వేసి సస్పెన్షన్ ఎత్తివేసింది.
అసలు ఏం జరిగిందంటే :
ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులను అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసనల్లో పాల్గొన్నందుకు వారిని హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. వైస్-ఛాన్సలర్ (ఎఫ్ఎసి) ప్రొఫెసర్ పి రాజశేఖర్ ఆదేశాల మేరకు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అశిర్వాదమ్, నవీన్..ఇంగ్లీష్ విభాగానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రాజు, ఏడుకొండలను హాస్టల్ చీఫ్ వార్డెన్ డాక్టర్ రామచంద్రన్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్న విద్యార్థులు “ప్రభుత్వ వ్యతిరేక చర్యలలో” పాల్గొన్నారని, అందువల్ల వారిని సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. విద్యార్థులను విశ్వవిద్యాలయ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. ఈ కమిటీ వారి వివరణ కోరి సస్పెన్షన్ కాలాన్ని నిర్ణయిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా విమర్శలు వెల్లువెత్తడంతో సదరు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేసింది ఏన్‌ఎన్‌యూ యాజమాన్యం.