
SSLC exams to take place in Karnataka tomorrow: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలు సైతం రద్దయ్యాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా పరీక్షలను రద్దుచేసే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్సెస్సెల్సీ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది.
రాష్ట్రంలో సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ రేపు 8 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.కర్ణాటకలో గురువారం (జూన్ 25) నుంచి ఎస్సెస్సెల్సీ పరీక్షలు జరుగుతాయని ఆరోగ్యశాఖ మంత్రి బీ శ్రీరాములు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,48,203 మంది SSLC పరీక్షలు రాయనున్నట్లు ఆరోగ్యమంత్రి వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ముఖాలకు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.