సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున 4.00 గంటలకు అమ్మవారి ఆలయానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం అమ్మవారికి మంత్రి తొలిబోనం సమర్పించారు. అమ్మవారికి బోనం సమర్పణతో జాతర ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే బోనాలు సమర్పించుకునేందుకు భక్తులు మహాంకాళి అమ్మవారి ఆలయంలో బారులు తీరారు. బోనాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని.. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.