AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ శివైక్యం.. మూడు రోజుల పాటు భక్తులకు దర్శనం

ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ విజయ్ కుమార్ నాయుడు చెన్నైలో కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని తిరుపతి జిల్లాలోని ఏకం క్షేత్రానికి తరలించారు. భక్తుల దర్శనార్థం మూడు రోజుల పాటు అక్కడే ఉంచనున్నారు. తనను తాను కల్కిగా ప్రకటించుకొని, భార్యతో కలిసి ఆధ్యాత్మిక ఉద్యమాన్ని స్థాపించిన ఆయన మృతి భక్తుల్లో తీవ్ర విషాదం నింపింది.

ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ శివైక్యం.. మూడు రోజుల పాటు భక్తులకు దర్శనం
Kalki Bhagwan Vijay Kumar Naidu
Balaraju Goud
|

Updated on: Sep 30, 2026 | 7:19 AM

Share

ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, ‘కల్కి భగవాన్’గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. మంగళవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. వైద్యులు చికిత్స అందించినప్పటికీ మంగళవారం (సెప్టెంబర్ 29) ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కల్కి ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు.

విజయ్ కుమార్ నాయుడు పార్థివ దేహాన్ని చెన్నై నుంచి తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెం మండలం బట్టలవల్లిలో ఉన్న ఏకం క్షేత్రానికి తరలిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు, అనుచరులు తుది నివాళులు అర్పించేందుకు వీలుగా సెప్టెంబర్ 30, బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఆయన పార్థివ దేహాన్ని ఆశ్రమంలో ఉంచనున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఏకం క్షేత్రానికి తరలివచ్చే అవకాశం ఉంది.

తమిళనాడులోని నాతం గ్రామంలో జన్మించిన విజయ్ కుమార్ నాయుడు.. ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించకముందు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో పనిచేశారు. 1980వ దశకం చివర్లో చిత్తూరు జిల్లాలో ‘జీవాశ్రమ్’ పేరుతో రెసిడెన్షియల్ పాఠశాలను స్థాపించారు. అనంతరం ఆధ్యాత్మిక బోధనల వైపు మళ్లి, తనను తాను విష్ణుమూర్తి పదో అవతారమైన ‘కల్కి భగవాన్’గా ప్రకటించుకున్నారు.

తన భార్య పద్మావతితో కలిసి ఆయన వరదయ్యపాలెంలో ఏకత్వ ఉద్యమాన్ని, గోల్డెన్ సిటీ ఆధ్యాత్మిక సముదాయాన్ని స్థాపించారు. పద్మావతిని ఆయన అనుచరులు ‘అమ్మ భగవాన్’గా పూజించేవారు. నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగిన ఈ ఆధ్యాత్మిక ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లోనూ పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు ఏర్పడ్డారు.

ధ్యానం, ‘దీక్ష’ ఆశీర్వాదం, చైతన్య తత్వం వంటి అంశాలను ప్రచారం చేస్తూ ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కల్కి భగవాన్ మృతితో ఆయన అనుచరులు, భక్తుల్లో విషాదం నెలకొంది. మూడు రోజుల పాటు ఏకం క్షేత్రంలో పార్థివ దేహాన్ని ఉంచనున్న నేపథ్యంలో తుది నివాళుల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us