రాష్ట్రంలో దక్షిణ కొరియా పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారంః కేటీఆర్

రాష్ట్రంలో దక్షిణ కొరియా పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారంః కేటీఆర్

దక్షిణ కొరియా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

Balaraju Goud

|

Nov 11, 2020 | 3:55 PM

దక్షిణ కొరియా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రాష్ట ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇండియా – కొరియా బిజినెస్ ఫోరం స‌ద‌స్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ద‌క్షిణ కొరియా పారిశ్రామిక వ‌ర్గాలు, భార‌త్ – కొరియా రాయ‌బారులు, ప‌లు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. రాష్ర్టంలో ద‌క్షిణ కొరియా పెట్టుబ‌డుల‌కు స్వాగ‌తం ప‌లుకుతామ‌ని తెలిపారు. ద‌క్షిణ కొరియకు చెందిన పారిశ్రామిక వ‌ర్గాలు, ప‌లు కంపెనీల ప్ర‌తినిధుల‌కు తెలంగాణ రాష్ర్టంలోని పెట్టుబ‌డి అవ‌కాశాల గురించి కేటీఆర్ వివ‌రించారు. తెలంగాణ‌లో పరిశ్రమ ఏర్పాటుకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే వినూత్న పారిశ్రామిక విధానాల‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకెళ్తుంద‌న్నారు. టీఎస్ ఐపాస్ విధానానికి పెట్టుబ‌డిదారుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. గ‌త ఆరేళ్ల‌లో సుమారు 30 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా పెట్టుబడులు తెలంగాణ‌కు వ‌చ్చాయ‌ని వివరించారు. తెలంగాణ పారిశ్రామిక విధానాల పట్ల ఆకర్షితులైన అనేక ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీలు హైద‌రాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు.

ఇప్పటికే కొరియా కంపెనీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత టెక్స్‌టైల్స్ దిగ్గజ కంపెనీ యంగ్వన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఇప్పటికే తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ డివైస్ పార్క్ ద్వారా కొరియాలోని గంగ్ వన్ టెక్ పార్క్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామ‌ని తెలిపారు. దీంతోపాటు హ్యుండై కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. ఇందుకోసం కొరియా పారిశ్రామిక వర్గాలు, కంపెనీలు ముందుకు వస్తే తెలంగాణ లో ప్రత్యేకంగా తెలంగాణ- కొరియా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సహకారం అందించాలని ఇరు దేశాల రాయబారులతో, కొరియా పారిశ్రామిక వర్గాలను మంత్రి కేటీఆర్ కోరారు. కొరియా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే వారికి అవసరమైన మానవ వనరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొంత ఖర్చులతో శిక్షణ ఇప్పించి నాణ్యమైన మానవ వనరులను అందుబాటులో తీసుకువస్తామని కేటీఆర్ తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu