మానవత్వం మంటగలుస్తోంది.ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. కన్న తల్లిదండ్రులను మనీ మెషీన్లుగా చూస్తున్నారు. ఆస్తి కోసం అనారోగ్యంతో బాధపడుతున్న వృద్దులైన తల్లిని ఇంటి నుంచి గెంటి వేసిన సంఘటన హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. పిల్లలను పెంచి పెద్ద చేసిన ఆ తల్లి చివరికి సొంత గూడు లేకుండా రోడ్లపాలైంది.
అంబర్‌పేట పరిథిలో గోల్నాకలో దారుణం జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న కన్నతల్లి కమలమ్మ (77)ను ముగ్గురు కొడుకులు నడి రోడ్డుపై వదిలేశారు. కొద్ది రోజుల క్రితం కమలమ్మ భర్త చనిపోయాడు. కమలమ్మకు పక్షవాతం బారినపడ్డారు. అప్పటి నుంచి ఆమె కొడుకులవద్దే ఉంటోంది. భర్త పేరున ఉన్న ఆస్తిని కొడుకులు ఆమె నుంచి బలవంతంగా రాయించుకున్నారు. తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని అలనాపాలనను మరిచారు. ఏకంగా ఇంటి నుంచి తరిమేశారు. కొడుకులకు ఇరుగుపొరుగు వారు సర్థి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి మొత్తం తీసుకుని తల్లిని నడిరోడ్డుపై వదిలేయడం సరికాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.