Temple For Late Father : తమను విడిచి కానరాని లోకాలకు వెళ్లిన తండ్రి జ్ఞాపకార్థం గుడిని నిర్మించాడు తనయుడు. అందులో తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు చేస్తున్నాడు. కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్న నేటి సమాజంలో ఇలాంటి కొడుకులు చాలా అరుదు. చనిపోయిన తండ్రికి గుర్తుగా విగ్రహం తయారు చేయించి…ఓ గుడి కట్టి పూజలు చేస్తున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.
మనోపాడ్ మండలం శ్రీ నగర్ గ్రామానికి చెందిన అనంతపద్మనాభ శివప్రసాదరావుకు ఎనిమిది మంది సంతానం. వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ శివరాత్రి , దసరా పండుగల వేళలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ…వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పద్ధతులను పాటిస్తూ వచ్చాడు. ఆ తర్వాత సాగును పెద్ద కుమారుడైన జగన్మోహన్ రావుకు అప్పగించాడు. గతేడాది ఆగస్ట్3న అనంతపద్మనాభ శివప్రసాదరావు చనిపోయారు. తండ్రి జ్ఞాపకాలను, ఆశయాలను కొనసాగించాలనే సంకల్పంతో ఇంటి ముందే శిలా విగ్రహంతో తండ్రికి గుడి కట్టించాడు జగన్‌మోహన్ రావు. అనునిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ..ప్రతి పండుగ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
గుడి చుట్టూ పచ్చని చెట్లు, వివిధ రకాల పూల మొక్కలను నాటి వాటికి పూసిన పూలతో పూజిస్తుంటాడు. తన తండ్రిలో దేవుణ్ణి చూస్తూ ఆధునిక యుగంలో ఆదర్శంగా నిలిచారు జగన్ మోహన్ రావు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కనీసం పట్టించుకోని మనుషులు ఉన్న ఈ కాలంలో… చనిపోయిన తండ్రికి గుడి కట్టి పూజలు చేస్తున్న జగన్‌మోహన్‌ను స్థానికులు కొనియాడుతున్నారు.
Also Read :
Wife beats husband : అపరకాళిగా మారిన ఆళి..భర్తను జెండా కర్రకు కట్టేసి కొట్టింది..ఎందుకో తెల్సా..?
Molar Pregnancy : విచిత్రమైన ముత్యాల గర్భం…ప్రెగ్నంట్ అవుతారు..కానీ కడుపులో బిడ్డ ఉండదు