కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను శివసేన నేత సంజయ్ రౌత్ ఖండించారు. ఇవి అనుచితమని, ఆసమంజసమని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఇండియా గురించి మీకు ఏం తెలుసునని అన్నారు. భారత రాజకీయ నాయకులపై ఓ విదేశీ పొలిటిషియన్ ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయరాదన్నారు. మేము ట్రంప్ ని ఉన్మాది అనగలమా ? అలా అనడంలేదే అన్నారు. ఈ దేశం గురించి ఒబామాకు సరైన అభిప్రాయం లేదన్నారు.
రాహుల్ ఎవరినీ ఇంప్రెస్ చేయలేరని, సబ్జె మీద ఆయనకు అవగాహన లేదని ఒబామా ‘ఎ ప్రామిస్డ్ లాండ్’అనే తన పుస్తకంలో పేర్కొన్నారు. దీనిపై సమీక్షను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. కాగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒబామా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. బహుశా అమెరికా అధ్యక్ష హోదాలో ఆయన ఎప్పుడో ఎనిమిది, తొమ్మిదేళ్ల క్రితం ఇండియాకు వచ్చ్చినప్పుడు రాహుల్ ఆయనతో భేటీ అయి ఉండవచ్చునని కాంగ్రెస్ నేత తారిఖ్ అన్వర్ అన్నారు. రాహుల్ అప్పటికీ… ఇప్పటికీ ఎంతో మారారని, ఎంతో అనుభవం సంపాదించారని ఆయన న్నారు. మా భారతీయ నాయకుల గురించి వ్యాఖ్యానించే అధికారం మీకు లేదన్నారు.