Kotte Edukondalu: జీవితంలో చాలా మందికి కష్టాలు ఎదురవుతాయి. వాటిని దాటుకుంటూ ముందుకు వెళితేనే జీవితంలో విజయం మన సొంతమవుతుంది. అయితే అలా కష్టాలు దాటుకొని విజయాన్ని సొంతం చేసుకున్న వారిలో కొందరు తాము పడ్డ కష్టాలు మరెవరూ పడకూడదని ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు కొట్టే ఏడు కొండలు. ఒకప్పుడు స్కూల్ డ్రాపవుట్ అయిన వ్యక్తి ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఎంతకీ ఎవరీ ఏడు కొండలు, ఆయన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..
నాగర్ కర్నూల్‌కు చెందిన కొట్టే ఏడు కొండలు ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఓ వైపు తన విధులు నిర్వర్తిస్తూనే మరో వైపు విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్‌ను అందిస్తున్నారు. అది కూడా ఉచితంగా కావడం విశేషం. 33 సెంటర్ల ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు కోచింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ ఉచిత తరగతులను నల్లగొండలో 2015లో ప్రారంభించారు. ప్రారంభంలో కేవలం 20 నుంచి 30 మంది విద్యార్థులతో మొదలైన ఈ ఉచిత శిక్షణ నేడు వేల మందికి చేరింది. అయితే 2017లో ఏడు కొండలు నాగర్ కర్నూల్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. కానీ విద్యార్థులు మాత్రం ఏడుకొండలు తరగతులు వినడానికి ఆసక్తి చూపించారు. దీంతో ఏడు కొండలు లోన్ తీసుకొని ఆన్‌లైన్ విధానంలో తరగతులు చెప్పడం ప్రారంభించారు. ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా తరగతులు వినడం ప్రారంభించారు. దీంతో 33 సెంటర్లను ఏర్పాటు చేసి ప్రస్తుతం లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు ఏడు కొండలు. ఈ తరగతులు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన గ్రౌండ్స్, ఆడిటోరియంలలో నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు ఏడు కొండలు ఒక్క రూపాయిని కూడా తీసుకోకపోవడం విశేషం. ఇప్పటి వరకు ఏడు కొండలు వద్ద శిక్షణ తీసుకున్న ఎంతో మంది విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించారు.
ఇక తన జీవితంలో ఎదురైన సంఘటనల గురించి చెప్పుకొచ్చిన ఏడు కొండలు.. నేను 8వ తరగతి చదువతోన్న సమయంలో స్కూల్ నుంచి డ్రాపవుట్ అయ్యాను. ఆ సమయంలో నాకు ఎక్కువగా క్రీడలపై ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే నా గురువు గారు ఒకరు నాతో పదో తరగతి పరీక్షలు రాయించారు. అనంతరం ఇంటర్ మీడియట్ పూర్తి చేసిన తర్వాత స్పోర్ట్స్ కోటలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాను. అనంతరం ఓపెన్ డిగ్రీని కూడా పూర్తి చేశాను. ఇక డిగ్రీ చేసిన తర్వాత నాకు సివిల్స్ రాయాలి అని ఆశ ఉండేది. కానీ కోచింగ్ తీసుకోవడానికి స్థోమత లేకపోవడంతో కోచింగ్‌కు వెళ్లలేకపోయాను. ఈ కారణంగానే విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందించాలని కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాను అని చెప్పుకొచ్చారు. కరోనా తర్వాత ఏడు కొండలు తన కోచింగ్‌ను యూట్యూబ్ ద్వారా కొనసాగిస్తున్నారు. నిస్వార్థంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోన్న ఏడు కొండలు నిజంగానే ఎంతో మందికి ఆదర్శం కదూ..!
Also Read: ఢిల్లీలో కోవిడ్ టెస్ట్ రిపోర్టులను ఫోర్జరీ చేసిన డాక్టర్, రోగులకు బురిడీ, అరెస్ట్
Viral News: అసలైన హీరో ఇతడేగా.. మనసు చలించి అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన నటుడు..