Sanitizers Shows Bad Effect On Children: కరోనా వైరస్ వ్యాప్తికి ముందు శానిటైజర్‌లు అంటే పెద్దగా ఎక్కువ మందికి తెలిసేవి కావు. ఆరోగ్య రంగంలో పనిచేసే వారు, డాక్టర్లు, నర్సులు లాంటి వారు మాత్రమే ఎక్కువగా వీటిని ఉపయోగించేవారు. కానీ ఏమంటూ కరోనా మహమ్మారి మానవ జీవితంలోకి ప్రవేశించిందో శానిటైజర్‌లేని ప్రదేశాలను భూతద్దంలో పెట్టి వెతికినా దొరకట్లేవు. షాపింగ్ మాళ్లు, థియేటర్లు, ఆఫీసులు, స్కూళ్లు ఇలా ఎక్కడ చూసినా శానిటైజర్లు దర్శనమిస్తున్నాయి. ప్రజలు కూడా వీటి వినియోగాన్ని బాగా పెంచారు.
ఈ క్రమంలోనే చిన్నారులు కూడా శానిటైజర్లను ఉపయోగించేస్తున్నారు. అయితే దీని ద్వారా చిన్నారుల్లో దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా పరిశోధకులు చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చిన్న పిల్లల్లో కళ్లు దెబ్బతింటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. చేతులకు శానిటైజర్ రాసుకున్న తర్వాత పిల్లలు తమకు తెలియకుండానే కళ్లు తుడుచుకుంటున్నారని, దీనివల్ల కళ్లపైప్రభావం పడుతుందని అధ్యయనంలో తేలింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 24 మధ్య పిల్లల కళ్లు దెబ్బతిన్న కేసులు ఏకంగా ఏడు రెట్లు పెరిగడం గమనార్హం. శానిటైజర్లలో ఉండే ఆల్కహాల్‌తో పాటు ఇతర ప్రమాదాకర రసాయనాలు పిల్లల కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పిల్లలను వీలైనంత వరకు శానిటైజర్లకు దూరంగా ఉంచుతూ సబ్బుతో చేతులను కడుక్కునే అలవాటు నేర్పించాలని సూచిస్తున్నారు.