రోజురోజుకు పెరిగిపోతున్న కాల్ మ‌నీ బాధితులు.. నిన్న మూడు క‌మిష‌న‌రేట్ సైబ‌ర్ క్రైమ్‌లో వంద కేసులు న‌మోదు

రోజురోజుకు కాల్ మ‌నీ లోన్ యాప్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. సైబ‌రాబాద్‌సైబ‌ర్ క్రైమ్ ప‌రిధిలో ఆదివారం ఒక్క రోజే 33 కేసులు నమోదైన‌ట్లు పోలీసులు తెలిపారు. హైద‌రాబాద్ సైబ‌ర్...

రోజురోజుకు పెరిగిపోతున్న కాల్ మ‌నీ బాధితులు.. నిన్న మూడు క‌మిష‌న‌రేట్ సైబ‌ర్ క్రైమ్‌లో వంద కేసులు న‌మోదు

Updated on: Dec 21, 2020 | 9:52 AM

రోజురోజుకు కాల్ మ‌నీ లోన్ యాప్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. సైబ‌రాబాద్‌సైబ‌ర్ క్రైమ్ ప‌రిధిలో ఆదివారం ఒక్క రోజే 33 కేసులు నమోదైన‌ట్లు పోలీసులు తెలిపారు. హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్‌లో నిన్న ఒక్క రోజే 39 కేసులు న‌మోదుకాగా, రాచ‌కొండ సైబ‌ర్ క్రైమ్ ప‌రిధిలో 30 కేసులు న‌మోద‌య్యాయి. అయితే మూడు క‌మిష‌న‌రేట్ సైబ‌ర్ క్రైమ్ ప‌రిధిలో ఆదివారం ఒక్క రోజే 100 కేసులు న‌మోదైన‌ట్లు పోలీసులు తెలిపారు.

అయితే యాప్ యాజ‌మాన్యం డ‌బ్బులు చెల్లించ‌మ‌ని నానా బూతులు తిడుతూ ఫోన్‌లో బెదిరిస్తున్నార‌ని బాధితులు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లోని మ‌హిళ‌ల‌కు ఫోన్ చేసి అస‌భ్య ప‌ద‌జాలంతో రుణాల ప్ర‌తినిధులు మాట్లాడుతున్నార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, ఫోన్‌లోని డేటాను యాక్సెస్ చేస్తున్న కేటుగాళ్లు.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లోన్ సంస్థ‌ల వివ‌రాలు సేక‌రిస్తున్నారు పోలీసులు. గ‌తంలో చైనా నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల‌కు అనుమ‌తులు పొందిన కొన్నింటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ‌బ్బులు వ‌సూలు చేయ‌డానికి థార్డ్ పార్టీ ఏజ‌న్సీల‌కు అప్ప‌గిస్తున్న లోన్ యాప్ నిర్వాహ‌కుల వేధింపులు త‌ట్టుకోలేక ప‌లువురు బాధితులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు.

కాగా, కాల్ మ‌నీ యాప్‌ల రూపంలో రుణాల పేరుతో సామాన్యుల‌కు వ‌ల వేసి వారి ప్రాణాల‌ను మింగేస్తున్నారు. అలాగే కాల్‌మ‌నీ యాప్‌లు అడ్డ‌గోలుగా వ‌సూలు చేసేందుకు స‌హ‌క‌రిస్తున్న బ్యాంకులపై కూడా బాధితులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. కాల్ మ‌నీ యాప్‌ల ద్వారా వ్యాపారం చేస్తూ జ‌నం జీవితాల‌తో చెల‌గాట‌మాడుతున్న కొన్నినాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు.. బ్యాంకుల‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయ‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

ఈ విష‌యం తెలియ‌క ఎంతో మంది చిరుద్యోగులు, రుణాల యాప్స్ నుంచి లోన్లు తీసుకుని బ‌ల‌వుతున్నారు. చాలా మంది సామాన్యులు రుణాలు తీసుకునేట‌ప్పుడు ఎలాంటి నిబంధ‌న‌లు అంగీక‌రిస్తున్నారో తెలియ‌క వారి ట్రాప్‌లో ప‌డిపోతున్నారు.