AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ధరణి, భూ భారతి పోర్టళ్లలో అక్రమాలు..! విచారణకు రేవంత్ సర్కార్ ప్రత్యేక కమిటీ

ధరణి, భూభారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో భద్రతా లోపాలు గుర్తించిన నేపథ్యంలో, బాధ్యులను గుర్తించి చర్యలు సూచించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సాంకేతిక సిఫార్సులు చేయాలని కమిటీకి బాధ్యతలు అప్పగించింది.

Telangana: ధరణి, భూ భారతి పోర్టళ్లలో అక్రమాలు..! విచారణకు రేవంత్ సర్కార్ ప్రత్యేక కమిటీ
Dharani, Bhu Bharati Portal Irregularities
Prabhakar M
| Edited By: |

Updated on: Jul 02, 2026 | 7:21 AM

Share

ధరణి, భూ భారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు సూచించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ధరణి పోర్టల్ నిర్మాణంలో భద్రతా లోపాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ లోపాలను కొందరు దుర్వినియోగం చేసి, కొన్ని మాడ్యూళ్ల ద్వారా అనధికారిక ఎంట్రీలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిపారు.

ధరణి సాంకేతిక నిర్మాణాన్ని ఆధారంగా తీసుకుని అభివృద్ధి చేసిన భూభారతి పోర్టల్‌లో కూడా ఇదే తరహా భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై కూడా సమగ్రంగా విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కొత్త సిస్టమ్ ఆర్కిటెక్చర్‌ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యున్నత సైబర్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కొత్త వ్యవస్థను అభివృద్ధి చేయాలని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC)కు సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు.

అక్రమాలకు కారణమైన వ్యక్తులను గుర్తించడం, వారిపై చర్యలు సూచించడం, భవిష్యత్తులో ఇలాంటి లోపాలు జరగకుండా సాంకేతిక సిఫార్సులు చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పించనుండగా, దాని ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఈ కమిటీలో కలెక్టర్లు, ఐటీ శాఖ అధికారులు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సీఐడీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌కు చెందిన నిపుణులు సభ్యులుగా ఉన్నారు. వివిధ కోణాల్లో సాంకేతిక, పరిపాలనా అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వనున్నారు.

భూముల రికార్డుల భద్రత, సమగ్రత, పారదర్శకత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. కమిటీ నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా కొత్త భద్రతా వ్యవస్థను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us