వర్సటైల్‌ సింగర్‌ కమ్‌ యాక్టరెస్‌ నూర్జహాన్‌ విశేషాలు ఇవే..!

తెరమీద అభినయించే నటీనటులకు గాయనీగాయకులు నేపథ్యగానాన్ని అందించే ప్రక్రియ ఇంకా ఆరంభంకాని దశలో అందం, అభినయం, సుమధుర గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఏకైక విదూషీమణి సురయ్య. ఆ మాటకొస్తే ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబర్చిన చివరి కళాకారిణి కూడా సురయ్యే అని అనడానికి ఎలాంటి మొహమాటాలు లేవు.. అప్పటికీ నూర్జహాన్‌ అనే వర్సటైల్‌ సింగర్‌ కమ్‌ యాక్టరెస్‌ ఉన్నా అందంలో మాత్రం సురయ్యదే పైచేయి. ఇవాళ ఆమె జయంతి కాబట్టి .. కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం! […]

వర్సటైల్‌ సింగర్‌ కమ్‌ యాక్టరెస్‌ నూర్జహాన్‌ విశేషాలు ఇవే..!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 15, 2020 | 5:29 PM

తెరమీద అభినయించే నటీనటులకు గాయనీగాయకులు నేపథ్యగానాన్ని అందించే ప్రక్రియ ఇంకా ఆరంభంకాని దశలో అందం, అభినయం, సుమధుర గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఏకైక విదూషీమణి సురయ్య. ఆ మాటకొస్తే ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబర్చిన చివరి కళాకారిణి కూడా సురయ్యే అని అనడానికి ఎలాంటి మొహమాటాలు లేవు.. అప్పటికీ నూర్జహాన్‌ అనే వర్సటైల్‌ సింగర్‌ కమ్‌ యాక్టరెస్‌ ఉన్నా అందంలో మాత్రం సురయ్యదే పైచేయి. ఇవాళ ఆమె జయంతి కాబట్టి .. కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం!

జూన్‌ 25, 1929లో లాహోర్‌ నగరంలో జన్మించిన సురయ్య జమాల్‌ షేక్‌ చిన్నప్పుడే ముంబాయిలో ఉంటూ కర్దార్‌ ఫిలిం కంపెనీలో పని చేస్తున్న తన మేనమామ దగ్గరకు వచ్చేసింది. ఆమె సినిమాల్లోకి రావడం యాదృచ్ఛికంగానే జరిగింది. ఓసారి తన అంకుల్‌తో కలిసి తాజ్‌మహల్‌ సినిమా షూటింగ్‌కు వచ్చిన సురయ్యకు అనుకోకుండానే అందులో ముంతాజ్‌మహల్‌ పాత్ర దొరికింది.. పసితనపు ఛాయలు వీడని ఆమెతో శారద సినిమాలో ఓ పాట పాడించి పెద్ద సాహసమే చేశారు సంగీత దర్శకుడు నౌషాద్‌. ఆ పాట భారతదేశమంతటా మారుమోగిపోయింది.. దాంతో సురయ్య స్టార్‌ అయ్యింది.. నాలుగో దశకంలో బాలీవుడ్‌ను సురయ్య, నూర్జహాన్‌లనే ఇద్దరూ నట గాయనీమణులు ఏలేవారు.. ఇద్దరూ కలిసి నటించిన మహబూబ్‌ఖాన్‌ సినిమా అన్మోల్‌ ఘడిని ఎవరు మాత్రం మర్చిపోగలరు?

దేశ విభజన తర్వాత నూర్జహాన్‌ పాకిస్తాన్‌కు వెళ్లిపోయింది.. సురయ్యకు తిరుగులేకుండాపోయింది.. 1946 నుంచి 1950 వరకు సురయ్య మకుటంలేని మహారాణిలా బాలీవుడ్‌ను ఏలింది.. ఈ మధ్య కాలంలో ఆమె పాతిక సినిమాల్లో నటించింది. పాటలు పాడింది. ఒకానొక శుభ సమయాన సుమధురగాయకుడు, నటుడు కేఎల్‌ సైగల్‌ కంటపడింది సురయ్య. జయంత్‌ దేశాయ్‌ తీస్తున్న చంద్రగుప్త సినిమా సెట్‌లో రిహార్సల్‌ చేస్తున్న సురయ్యను చూశాడు సైగల్‌.. ఆ గాత్రానికి, ఆ అందానికి ముచ్చపడిపోయి తన తక్బీర్‌లో అవకాశమిచ్చాడు. ఆ సినిమా సూపర్‌హిట్టయ్యింది.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉమర్‌ఖయ్యాం, పర్వానాలలో నటించారు.. తెరపై వీరిద్దరు పండించిన కెమెస్ట్రీకి ప్రేక్షకులు మైమర్చిపోయారు.

ఆ తర్వాత సురయ్య వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లింది. ఫూల్‌, విద్య, జీత్‌, దాస్తాన్‌, సనమ్‌, అఫ్సర్‌ వంటి సినిమాలు సురయ్యకు పేరును .. నిర్మాతలకు డబ్బును తెచ్చిపెట్టాయి. 1948లో వచ్చిన ప్యార్‌ కీ జీత్‌, 1949లో వచ్చిన బడీ బెహన్‌, దిల్లగీలు అయితే బాక్సాఫీసును బద్దలు కొట్టాయి. సొహ్రబ్‌ మోదీ దర్శకత్వంలో వచ్చిన మీర్జా గాలీబ్‌ సినిమా అయితే చెప్పనే అక్కర్లేదు.. ఆ సినిమా రెండు జాతీయ అవార్డులను కూడా గెల్చుకుంది. సినిమా చూసిన ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అయితే సురయ్యను ఎంతగానో అభినందించారు. అలా తిరుగులేని నటిగా, గాయనిగా పేరు ప్రఖ్యాతులు గడించిన సురయ్య 34 ఏళ్ల వయసుకే సినిమాల్లోంచి తప్పుకుంది.. 1963 తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.. ఆమె పాటా వినిపించలేదు.. అందుకు కారణం దేవానంద్‌తో ప్రేమలో పడటం.. అది విఫలం కావడం.. సురయ్య ప్రేమ వలలో దేవానంద్‌ చిక్కుకున్నాడో, దేవానంద్‌ అమాయకత్వానికి సురయ్య పడిపోయిందో తెలియదు కానీ ఇద్దరూ మధ్య కొన్నాళ్ల పాటు ప్రేమ నడిచింది. దేవానంద్‌ ఫీల్డ్‌లో ఎంటరయ్యే టైమ్‌కే సురయ్య సూపర్‌స్టార్‌. హిందీ, ఉర్దూ సినిమా ప్రేక్షకులకు ఆమె కలలరాణి…ఎంతటి సౌందర్యరాశో అంత అద్భుతమైన గాయని. నాలుగేళ్ల పాటు ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వీళ్ల ప్రేమకు సురయ్య అమ్మమ్మ అడ్డుపడింది…ఇద్దరి హృదయాలు బద్దలయ్యాయి. దేవానంద్‌ మనసు చంపుకోగలిగాడు… సురయ్య ఆ పని చేయలేకపోయింది…

సురయ్యతో కలిసి దేవ్‌ నటించిన మొదటి సినిమా విద్య. ఇది 1948లో వచ్చింది…సురయ్యను చూసి చూడ్డంతోనే దేవ్‌ నిలువెత్తు ప్రేమలో కూరుకుపోయాడు.. ఆమె మోహంలో పడిపోయాడు. సురయ్యను అవసరమున్నా లేకున్నా తెగ పొగిడేవాడు దేవ్‌…ఆమెకు తెలుసు…దేవ్‌ తనను పిచ్చపిచ్చగా ప్రేమిస్తున్నాడని…నెమ్మదిగా ఆమె కూడా దేవ్‌ను ఇష్టపడటం మొదలు పెట్టింది..సురయ్య ఇష్టాఇష్టాలను దేవ్‌ తన ఇష్టాలుగా చేసుకున్నాడు…సురయ్యకు గ్రెగరీ పెక్‌ ఇష్టమని తెలుసుకుని తనూ అలాగే తయారయ్యేవాడు…వీరిద్దరి మధ్య లవ్‌స్టోరీ మొదలైందన్న సంగతి చాలా కాలం వరకు ఎవరికీ తెలియదు. నైంటీన్‌ ఫిఫ్టీస్‌లో ఎందుకోగాని సురయ్య ఫ్యామిలీకి అనుమానమొచ్చింది. అప్పటికే వీరిద్దరు కలిసి మూడు సినిమాల్లో నటించేశారు. నాలుగో సినిమా అఫ్సర్‌. ఈ సినిమా షూటింగప్పుడే దేవ్‌-సురయ్య మధ్య ఏదో వుందన్న విషయం పరిశ్రమ గ్రహించేసింది. బొంబాయి టాబ్లాయిడ్స్‌ ఇష్టం వచ్చిన రాతలు రాసేశాయి. ఇది సురయ్య ఇంట్లో కూడా తెలిసిపోయింది. సురయ్య మేనమామకు మాత్రం ప్రేమ విషయంలో కాస్త సాఫ్ట్‌ కార్నరే వుండేది… కానీ అమ్మమ్మే పడనీయలేదు. సురయ్యను నీడలా వెంటాడింది. ఇద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా చిత్రీకరించడానికి అంగీకరించలేదావిడ! పాపం సురయ్య తల్లేమో ఎటూ చెప్పలేని అమాయకురాలు. ఆమెకు కూడా సురయ్యను దేవానంద్‌కిచ్చి పెళ్లి చేయాలని వుండేది! ప్రియురాలిని కలుసుకోడానికి ఇంటికెళ్లినప్పుడల్లా దేవ్‌కు అమ్మమ్మ అడ్డుతగిలేది. ఫోన్‌ చేసినా ఇదే పరిస్థితి. ఎప్పుడూ ఆ ముసిలావిడే లిఫ్ట్‌ చేసేది. ఇలా తరుచుగా ఫోన్‌ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది కూడా. అయినా దేవ్‌ ఫోన్‌ చేస్తూనే వున్నాడు. ఓ రోజు దేవ్‌ అదృష్టం కొద్దీ ముసిలావిడ నిద్రపోతోంది. అప్పుడు సురయ్య తల్లి ఫోన్‌ ఎత్తింది. తన గోడంతా వెలిబుచ్చుకున్నాడు… ఒక్కసారి సురయ్యతో మాట్లాడే అవకాశం కల్పించమని వేడుకున్నాడు. ఆమె సరేనంది. రాత్రి పదకొండున్నరకు వస్తే సురయ్యను కలిపిస్తానంది. దేవ్‌కెందుకో ఈ మాట నమ్మబుద్దేయలేదు. తారాసింగ్‌ అనే బొంబాయికి చెందిన పోలీసాఫీసర్‌ మిత్రుడిని వెంటేసుకుని వెళ్లాడు. సురయ్య వుంటున్న ఆరంతస్తుల బిల్డింగ్‌ టెరాస్‌పైన మీటింగ్‌ ప్లేస్‌ను ఏర్పాటు చేశారు.. సరిగ్గా పదకొండున్నరకు దేవ్‌ బిల్డింగ్‌ మీదకు చేరుకున్నాడు. అప్పటికే సురయ్య వాటర్‌ట్యాంక్‌ దగ్గర దేవ్‌ కోసం ఎదురుచూస్తూ నిలుచుకుంది. ఇద్దరి చూపులు కలిసాయి. కొన్ని నిమిషాల పాటు ఇద్దరు కన్నీరు కార్చారు. అరగంట పాటు ఇద్దరి ఊహలు గుసగుసలాడుకున్నాయి. భారంగా ఇద్దరూ అక్కడ్నుంచి నిష్ర్కమించారు. మళ్లీ జీవితంలో కలుసుకోలేదు. తర్వాత కొన్నాళ్ల పాటు దేవానంద్‌ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. సురయ్య జ్ఞాపకాల నుంచి బయటపడలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. మరోవైపు సురయ్య మాత్రం ఈ షాక్‌ నుంచి తేరుకోలేకపోయింది… భగ్న ప్రేమికురాలిగా కుమిలిపోయింది. ఇదే సమయంలో లతా మంగేష్కర్‌ దూసుకొచ్చింది..సురయ్య వద్దనుకుందో…లేక సురయ్యను నిర్మాతలు వద్దనుకున్నారో తెలియదు కానీ, ఆమె మాత్రం నెమ్మదిగా ఫేడవుట్‌ అయింది. దేవానంద్‌ను వలచిన ఆమె మరోకరితో జీవితాన్ని పంచుకోలేకపోయింది. వివాహం చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగానే గడిపింది..ఓ వెలుగు వెలిగిన సురయ్య జీవితాంతం చీకట్లోనే గడిపింది…ఆమెను పరిశ్రమ కూడా పట్టించుకోలేదు…రెండువేల నాలుగులో బొంబాయిలోని తన ఫ్లాట్‌లో ఒంటరిగానే కన్నుమూసింది. —-బాలు