యూపీలో లంచాల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లంచగొండుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ అవి ఆగడం లేదు. వివరాల్లోకెళితే.. లంచం ఇవ్వలేదని ఓ ఇద్దరు అధికారులు కలిసి.. తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేశారు. వెయ్యి రూపాయల కోసం ఆశపడి.. ఇద్దరు చిన్నారులకు వందేళ్ల వయసున్నట్లు బర్త్ సర్టిఫికెట్‌లో నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలోని ఖుతార్ పోలీసు స్టేషన్ పరిధిలోని బేల గ్రామానికి చెందిన పవన్ కుమార్.. తమ పిల్లల బర్త్ సర్టిఫికెట్ల కోసం వీడీవో(విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్) సుశీల్ చంద్, వీహెచ్‌వో(విలేజ్ హెడ్ ఆఫీసర్) ప్రవీణ్ మిశ్రాను సంప్రదించాడు. బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయాలంటే ఇద్దరు పిల్లలకు రూ. 500 చొప్పున లంచం ఇవ్వాలని ఆ అధికారులు డిమాండ్ చేశారు.
పవన్ నిరాకరించడంతో.. నాలుగేళ్ల వయసున్న శుభ్‌కు 104 ఏళ్లు, రెండేళ్ల వయసున్న సంకేత్‌కు 102 ఏళ్లు ఉన్నట్లు బర్త్ సర్టిఫికెట్లను ఆ అధికారులు జారీ చేశారు. దీంతో పవన్ కుమార్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. సుశీల్ చంద్, ప్రవీణ్ మిశ్రాపై కేసు నమోదు చేయాలని అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.