దేశ ప్రజలు క్యాబ్ లను ఎక్కువగా ఆశ్రయిస్తుండటం వల్లే కార్ల అమ్మకాలు తగ్గాయంటూ గతంలో కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారమన్. ఇటీవల నిర్వహించిన జీఎస్టీ భేటీలో కరోనా ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అంటూ చెప్పుకొచ్చి మళ్లీ అదే రీతిన కౌంటర్లు చవిచూస్తున్నారు. లెఫ్ట్ పార్టీలతోపాటు, తాజాగా ఆమె భర్త పరకాల ప్రభాకర్ కూడా ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ ను ఉదహరిస్తూ కేంద్రం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ శివసేన నేత.. ఎంపీ సంజయ్ రౌత్ కూడా నిర్మల వ్యాఖ్యలతో తీవ్రంగా విభేదించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతూ దేవుడ్ని నిందించడం హిందుత్వకు అవమానకరమని సామ్నా పత్రికలో రాసిన వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. ‘దేవుడి తప్పిదమే అయితే ఏ కోర్టులో ఆయనను విచారిస్తారు..? మన ప్రధాని అన్ని విషయాల గురించి మాట్లాడతారు.. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థపై మాత్రం నోరుమెదపరు.. నోట్ల రద్దు నుంచి లాక్‌డౌన్ వరకూ సాగిన ప్రయాణంలో మన ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైంది’ అని రౌత్ కామెంట్ చేశారు. కరోనా ఉత్పాతాన్ని ఎదుర్కొనేందుకు బ్రెజిల్ సహా పలు దేశాలు తమ పౌరులకు ఆర్థికంగా చేయూత అందించాయని.. ఆయా ప్రభుత్వాలు కోవిడ్-19 సమస్యను దైవ ఘటనగా చూడలేదని, ఆర్థిక సంక్షోభంగానే పరిగణించి పౌరులను ఆదుకున్నాయని చెప్పుకొచ్చారు.