దేశంలో స్వల్పంగా తగ్గుతున్న కరోనా తీవ్రత..!
భారతదేశంలో కొవిడ్ పాజిటివ్ కేసులు ఇప్పుడు 6 మిలియన్లు ఉండగా మరో మిలియన్ కేసులు నమోదవ్వడానికి మునుపటి కంటే ఎక్కువ సమయం పడుతుందంటున్నారు నిపుణులు.
భారత్‌లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఐదు రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం. అందులో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లు వరుస క్రమంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉండటం గమనార్హం. కొత్త పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటోందంటున్నారు నిపుణులు. కానీ, గత వారంలో ఐదు అధిక కేసులు నమోదైన రాష్ట్రాలలో క్రియాశీల ఇన్ఫెక్షన్ల వ్యాప్తి తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రాల్లోని ప్రధాన మెట్రో నగరాల్లో వ్యాధి తీవ్రతపై చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ సైంటిస్టులు అధ్యయనం చేశారు.
ముంబై, పూణే, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాలు మహమ్మారి పురోగతి ఎలా ఉంటుందనే దానిపై వారు అధ్యయనం నిర్వహించారు. సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమైన వారంలో భారతదేశంలో R విలువ స్వల్పంగా 0.9 కు పడిపోయింది. మునుపటి వారం కంటే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కేసుల తీవ్రత తగ్గుమొఖం పట్టిందన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 19 నుండి 22 వరకు 1 కంటే తక్కువ R విలువను నమోదు చేయగా, ఈ సంఖ్య మహారాష్ట్ర, కర్ణాటకలలో మళ్లీ పుంజుకోవడం ప్రారంభించిందని సీతాభ్రా సిన్హా అనే పరిశోధకుడు చెప్పారు.
తాజాగా భారతదేశంలో కొవిడ్ పాజిటివ్ కేసులు ఇప్పుడు 6 మిలియన్లు ఉండగా మరో మిలియన్ కేసులు నమోదవ్వడానికి మునుపటి కంటే ఎక్కువ సమయం పడుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రపైనే భారతదేశం ఆధారపడి ఉందన్నారు. ఆ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో క్రియాశీల కేసులు నమోదైతే మళ్లీ అదే పరిస్థితి నెలకొంటుందని సీతాభ్ర సిన్హా తెలిపారు. అయితే, ఇప్పటివరకు మహారాష్ట్ర భారతదేశం ఆర్ విలువపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని సిన్హా చెప్పారు. 1 కంటే తక్కువ R విలువను భారతదేశం ఎక్కువ కాలం కొనసాగించగలిగితే, కరోనా వైరస్ క్షీణించడం ప్రారంభమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.