Farmers Protest: నూతన వ్యవసాయ చట్టాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

|

Jan 11, 2021 | 4:27 PM

Farmers Protest: కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ మూడు వ్యవసాయ చట్టాలు, రైతులు చేస్తున్న ఆందోళనపై సుప్రీం...

Farmers Protest: నూతన వ్యవసాయ చట్టాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
Follow us on

Farmers Protest: కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ మూడు వ్యవసాయ చట్టాలు, రైతులు చేస్తున్న ఆందోళనపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంతకాలంగా చట్టాల అమలును నిలిపివేయాలని, లేదంటే తామే స్టే విధిస్తామని తేల్చి చెప్పింది. చట్టాల పరిశీలనకు గాను ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.

రైతులు తమ నిరసనను కొనసాగించవచ్చని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టాలపై స్టే ఇచ్చిన తర్వాత ఆందోళన నిలిపివేస్తారా..? అని సుప్రీం కోర్టు రైతు సంఘాల ఉద్యమ నేతలను ప్రశ్నించింది. తదుపరి విచారణ రేపటికి వాయివా వేసింది.

సమస్య పరిష్కారానికి తాము ప్రయత్నిస్తున్నాం..

అయితే ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మక సమస్యగా ఎందుకు చూస్తోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరత్‌ అరవింద్‌ బాబ్డే వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్ర వైఖరిపై అసంతృప్తితో ఉన్నామని, రైతుల ఆందోళన, సమస్యలను పరిష్కరించడంలో సరిగా వ్యవహరించలేదన్నారు. పలు దఫాలు చర్చలు విఫలంపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సరిగ్గా నిర్వహిస్తోందని, చర్చలు ప్రభావవంతంగా ఉన్నాయని తాము విశ్వసించడం లేదని ఘాటుగా స్పందించారు. అందుకే చట్టాల అమలును నిలిపివేయడం ద్వారా వాతావరణాన్ని అనుకూలంగా మార్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. రైతు సంఘాలతో ప్రభుత్వ చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య సీజేఐ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రైతుల సమస్యలను కమిటీకి నివేదించాలి..

సమస్య పరిష్కారం కోసం కోర్టు ఏర్పాటు చేసే కమిటీ ముందుకు వెళ్లాలని రైతులను ధర్మాసనం కోరింది. తమ సమస్యలను కమిటీకి నివేదిస్తే.. వాటిని కోర్టు పరిశీలిస్తుందని తెలిపింది. ఇందుకు రైతు సంఘాల తరపున న్యాయవాది దుష్యంత్‌ దవే స్పందిస్తూ, దీనిపై రైతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇక ఆందోళన చేస్తున్న వారిలో వృద్ధులు, మహిళలు వెనక్కి వెళ్లేలా చూడాలని కోర్టు సూచించింది. ప్రస్తుతం కోవిడ్‌ ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆందోళనలో ఉన్నవారిలో చాలా మంది పెద్ద వయసు ఉన్నవారే ఉన్నారని, వారంతా వెనక్కి వెళ్లిపోవాలని కోర్టు సూచించింది.

చట్టాన్ని నిలిపివేయడం సాధ్యం కాదు..

కాగా, చట్టాలను నిలిపివేయడం సాధ్యం కాదని, దీనిపై సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు చేయవచ్చని కేంద్రం తరపున అటర్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. ఏ చట్టమైనా ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్దంగా ఉంటే తప్ప చట్టాన్ని నిలిపివేసే హక్కు కోర్టుకు లేదని అన్నారు. సుప్రీం గత తీర్పులు కూడా ఇదే చెబుతున్నాయని గుర్తు చేశారు. అయితే కొత్తగా తీసుకువచ్చిన చట్టాలపై యావత్‌ దేశం సంతృప్తిగానే ఉందని, కేవలం రెండు, మూడు రాష్ట్రాల వారు మాత్రమే ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు.

Union Budget 2021: 1947 తర్వాత తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్స్ సమావేశాలను నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం