కొత్త రిజిస్ట్రేషన్లు..కొత్త సమస్యలు..ధరణి పద్దతినే అనుసరిస్తున్నారని బిల్డర్లు ఆందోళన

|

Dec 14, 2020 | 10:41 PM

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో సమస్యలు ఇంకా తొలగిపోలేదు. ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌కు రిజిస్ట్రేషన్‌కు లింకు పెట్టడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. అటు అన్‌లైన్‌లో...

కొత్త రిజిస్ట్రేషన్లు..కొత్త సమస్యలు..ధరణి పద్దతినే అనుసరిస్తున్నారని బిల్డర్లు ఆందోళన
Follow us on

Problems in The Registration : తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో సమస్యలు ఇంకా తొలగిపోలేదు. ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌కు రిజిస్ట్రేషన్‌కు లింకు పెట్టడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. అటు అన్‌లైన్‌లో ఈసీ కనిపించడం లేదు. బ్యాంక్ మర్టిగేజ్ ఆప్షన్‌ కూడా పోర్టల్ లో దొరకడం లేదు. దీంతో పేరుకు పాత పద్ధతే అయినా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లలో కూడా ధరణి పద్దతినే అనుసరిస్తున్నారని బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పటికైనా సాంకేతిక సమస్యలు తొలగించాలని కోరుతున్నారు.

మేడ్చల్‌ జిల్లాలోని మల్కాజిగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర బిల్డర్ల నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గత మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసి తమకు తీవ్ర అన్యాయం చేసిందని ఇప్పుడు తిరిగి రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టినా సాధ్యం కానీ రూల్స్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీఏఎన్,ఏపీఏఎన్‌ లేకుండా రిజిస్ట్రేషన్ చేయడంలేదని, ఇది సాధ్యం కాదని దీన్ని తొలగించి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని బిల్డర్లు డిమాండ్ చేస్తున్నారు.

కొత్త రిజిస్ట్రేషన్ల విధానం వల్ల అందరికీ అవగాహన లేదని, అయితే త్వరలోనే పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇందులో ఎదురవుతున్న సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. సాధ్యమైనంత త్వరగానే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను వేగవంతం చేస్తామంటున్నారు రెవెన్యూ అధికారులు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని చోట్ల ఇదే సమస్య ఎదురవుతోంది. దీంతో టెక్నికల్‌ సమస్యలను సాధ్యమైనంత త్వరగా తొలగించాలని బిల్డర్లు కోరుతున్నారు. కొన్నిచోట్ల ఇళ్లు, అపార్ట్‌మెంట్ల వరకే రిజిస్ట్రేషన్ల స్లాట్‌ చూపిస్తున్నారని, ఓపెన్‌ ప్లాట్ల స్లాట్స్‌ కనిపించడం లేదంటున్నారు. ఓపెన్‌ ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ లింకు పెడితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు బిల్డర్లు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే పాతపద్దతిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని బిల్డర్లు కోరుతున్నారు.