AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్న వన్యప్రాణులు.. గర్భిణీ చుక్కల జింక మృతి, కడుపులోని శిశువు కూడా..

Palvancha Deer Death: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కిన గర్భిణీ చుక్కల జింక, దాని కడుపులోని బిడ్డ మృతి చెందాయి. తీవ్ర గాయాలతో జింక పరుగుతీసినా, చివరకు తల్లిబిడ్డలను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వన్యప్రాణుల సంరక్షణకు గస్తీ పెంచి, వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖను డిమాండ్ చేస్తున్నారు.

వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్న వన్యప్రాణులు.. గర్భిణీ చుక్కల జింక మృతి, కడుపులోని శిశువు కూడా..
Palvancha deer death
N Narayana Rao
| Edited By: |

Updated on: Aug 26, 2026 | 11:58 AM

Share

రాష్ట్ర జంతువు అయిన చుక్కల జింక వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని తీవ్ర గాయాల పాలైంది. అయితే జింక గర్భవతి కాగా, కడుపులోని బిడ్డ అయినా దక్కుతుందని ఆశతో ఉచ్చు నుంచి తప్పించుకొని తీవ్రగాయాలతో పరుగులు తీసినట్లు తెలుస్తోంది. చివరి వరకు వైద్యం అందించిన వెటర్నరీ వైద్యులు ఆ జింకను కాపాడలేకయారు. జింక శిశువును కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అటవీ రేంజి పరిధి మాదారం అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఉచ్చులు అమర్చారు. ఈ ప్రాంతానికి మేత కోసం వెళ్ళిన జింక ఉచ్చులో చిక్కుకుంది. ఇది గర్భవతి కావడం.. కడుపు చుట్టూ ఉచ్చు బిగించుకోవడంతో తాను లేకున్నా బిడ్డనైనా బతికించుకోవాలని అష్ట కష్టాలు పడి ఉచ్చులు తెంచుకుంది. అప్పటికే తీవ్ర గాయాలపాలై పడుతూ లేస్తూ రోడ్డు దాటుతుంది. గమనించిన అటవీ సిబ్బంది దానిని వెంటనే పాల్వంచ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.

డాక్టర్లు వెంటనే స్పందించి చికిత్స అందించినప్పటికీ, అప్పటికే జింక పరిస్థితి అత్యంత విషమంగా మారి జింక మృతి చెందింది. మృతి చెందిన జింక గర్భిణీ అని గుర్తించి.. దాని కడుపులోని పిల్లను అయినా కాపాడాలని బయటకు తీసి ఆపరేషన్ చేశారు. అయితే, అప్పటికే పిల్ల కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు.

వన్యప్రాణులను పొట్టనబెట్టుకుంటున్న వేటగాళ్లపై అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపాలని, అడవుల్లో గస్తీ పెంచి ఉచ్చులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ​వన్యప్రాణులకు సకాలంలో అత్యవసర వైద్యం అందేలా పూర్తిస్థాయి వెటర్నరీ సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం నివేదిక ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసి, వేటగాళ్లను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు తెలిపారు.

Follow Us