
పేరుకు గ్రేటర్ హైదరాబాద్.. కానీ కదిలిస్తే ఎన్నో సమస్యలు కళ్ల ముందుంటాయి. ఏ సిటీకైనా కనీస వసతులతో పాటు మంచినీటి సౌకర్యం ముఖ్యం. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని చోట్లా ఇప్పటికే జనాలు కలుషిత నీటిని తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ముఖ్యంగా రెండో వార్డులో తాగునీరు కలుషితమవుతుండటంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో కాలనీవాసులకు బురద నీరే తాగునీరుగా మారింది. అయితే గత కొన్ని రోజులుగా కలుషిత తాగునీరు సరఫరా అవుతుంది, దీంతో నీటి ద్వారా వచ్చే వ్యాధులు అనేకం నమోదవుతున్నాయని స్థానికులు చెబుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
నీటి నాణ్యత సరిగా లేదని పలుమార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని, క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్ (క్యూఏఅండ్టీ) విభాగం లేకపోవడమే ఇందుకు కారణమని స్థానికులు వాపోతున్నారు. ఎస్ సీబీ పంప్ హౌజ్ లకు హెచ్ ఎండబ్ల్యూఎస్ ఎస్ బీ నీటిని సరఫరా చేసిన తర్వాత నీటి నాణ్యత తనిఖీలు నిర్వహించడం లేదు. అయితే సిటీజనం తాగునీటి సమస్యను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గన్ బజార్, రసూల్పురా, కార్ఖానాలోని పలు నివాస కాలనీలు ఇదే సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. ‘ముఖ్యంగా కంట్మోనెంట్ లో తాగునీటి సమస్య అంతులేని సమస్యగా మారింది. ప్రతి ఐదు రోజులకు ఒకసారి సక్రమంగా నీటి సరఫరా జరగకపోవడమే కాకుండా నీటి నాణ్యత కూడా సరిగ్గా ఉండటం లేదు. కొన్నిసార్లు బురద నీరే వస్తోంది. అది కూడా దుర్వాసనతో ఉంటుంది అని కార్ఖానా నివాసి రమేష్ తన బాధను వ్యక్తం చేశాడు.
“చాలా రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుండటం, కాలనీవాసులు అవి తాగుతుండటంతో చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నీరు తాగడానికి సరైంది కాదు అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కలుషిత నీటిని తాగలేక వాటర్ క్యాన్లు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయా కాలనీవాసులు.