AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIT on Chandrababu regime: బాబు జమానాపై సిట్… ఏపీలో రాజకీయ దుమారం

చంద్రబాబు జమానాలో అమలైన విధానాలు, జరిగిన పనులపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం (సిట్) ఏర్పాటుపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది. ఇది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది.

SIT on Chandrababu regime: బాబు జమానాపై సిట్... ఏపీలో రాజకీయ దుమారం
Rajesh Sharma
|

Updated on: Feb 22, 2020 | 4:34 PM

Share

SIT controversy rocks AP: గత అయిదేళ్ళలో చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలపై జగన్ ప్రభుత్వం ప్రారంభించిన సిట్ దర్యాప్తు ఏపీవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఇంటిలిజెన్స్ డీఐజీ రఘురామ్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్దం మొదలు కాగా.. సందేట్లో సడేమియాలాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం తమ వంతు వాదనను వినిపిస్తూ రాజకీయ దుమారాన్ని మరింత రాజేస్తున్నాయి.

డిఐజీ రఘురామ్ రెడ్డి నేతృత్వంలో పనిచేయనున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బృందం కోసం ‌ముగ్గురు ఐపీఎస్ అధికారులతోపాటు అదనపు ఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి అమలు చేసిన కీలక విధానాలు, ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాలపై రఘురామ్ రెడ్డి సారథ్యంలోని సిట్ దృష్టి సారించనున్నది. సీఆర్డీఏ పరిధిలో జరిగిన భూముల లావాదేవీలపై సిట్ బృందం కూపీ లాగనున్నది. మొత్తానికి యాభై ప్రభుత్వ శాఖల్లో జరిగిన అన్ని పరిణామాలను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది సిట్.

శుక్రవారం సాయంత్రం సిట్ ఏర్పాటు విషయం వెల్లడైన వెంటనే ఏపీలో రాజకీయ రచ్చ మొదలైంది. ఒకవైపు ఈఎస్ఐ, ఇంకోపక్క సిట్ ఏర్పాటులతో జగన్ ప్రభుత్వం కక్షసాధింపు విధానాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. తెలుగుదేశం నేతలు చినరాజప్ప, బుద్దా వెంకన్న, పితాని సత్యనారాయణ, బొండా ఉమ, నక్కా ఆనంద్‌బాబు, కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని రచ్చ మొదలు పెట్టారు. ఏదో ఒక అంశంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించడం తెలుసని.. కానీ ఇలా మొత్తం అయిదేళ్ళపాలనపై సిట్ వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సిట్‌లో విధానపరమైన అంశాలను ఎలా తేలుస్తారని అడుగుతున్నారు వారు. సీఎస్ స్థాయి అధికారి నిర్ణయాలపై, ఆదేశాలపై ఓ ఐపీఎస్ అధికారి ఎలా విచారణ జరుపుతారని నిలదీస్తున్నారు దేశం నేతలు. నారాలోకేశ్ తన ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా సిట్ ఏర్పాటును తప్పుపట్టారు.

కేవలం పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ప్రభుత్వ విధానాలపై విచారణ జరపలేదన్న టీడీపీ వాదనలో బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు కూడా ఏకీభవిస్తున్నారు. తనను కూడా సిట్‌లో వినియోగించుకోవాలని, రాజకీయాలకు అతీతంగా సిట్‌కు తాను స్వచ్ఛందంగా సహకరిస్తానని అంటున్నారు. అయితే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పనులపై సిట్ ఏర్పాటును బీజేపీ నేతలు స్వాగతిస్తుండగా.. ఏపీ కాంగ్రెస్ నేతలు టీడీపీకి అండగా నిలుస్తున్నారు. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సిట్ ఏర్పాటును తప్పుపట్టారు. టీడీపీ నేతలను వేధింపులకు గురి చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తులసిరెడ్డి ఆరోపించారు.

మరోవైపు అధికార పార్టీకి చెందిన మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్‌లతో పాటు మల్లాదివిష్ణు, పార్థసారథి వంటి నేతలు సిట్ ఏర్పాటును సమర్థించుకుంటున్నారు. అయిదేళ్ళ కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు సిట్ ఏర్పాటు అనివార్యమైందని అంటున్నారు. ఏ తప్పు చేయకపోతే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.

మొత్తమ్మీద సిట్ ఏర్పాటు ఏపీలో పెద్ద రాజకీయ దుమారాన్నే రేపుతోంది. దర్యాప్తు బృందం ఏం తేల్చక ముందే, అసలింకా దర్యాప్తు ప్రారంభించక ముందే ఏపీలోని రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం తీవ్రమవడం విశేషం. త్వరలో జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలపై సిట్ ఏర్పాటు ప్రభావం తీవ్రంగా వుండే పరిస్థితి కనిపిస్తోంది.