Palnadu Leaders: పౌరుషాల గడ్డ పల్నాడులో గాంధీగిరీ చేశారు వైసీపీ నేతలు. రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు. ఎప్పుడూ డైలాగ్‌లతో వేడెక్కే గురజాల రాజకీయం ఈసారి గాంధీగిరీతో ఆసక్తిగా మారింది. కట్ చేస్తే, నగర పంచాయతీ ఎన్నికల నగారా మోగకముందే గురజాల రాజకీయం మరోసారి వేడెక్కినట్లైంది. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని మధ్య ఉన్న రాజకీయ వైరం ఈసారి గాంధీగిరీ వైపు టర్న్ తీసుకుంది.
కాగా, త్వరలో గుజరాల, దాచేపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిని అడ్డుకునేందుకే టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేశారన్నది వైసీపీ ఆరోపణ. ఎన్నికలను ఆపడం ద్వారా పథకాలను అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సైతం టీడీపీ తీరుపై విమర్శలు చేశారు. ఆయన పిలుపుతోనే గురజాల, దాచేపల్లిలో రోడ్లను ఊడ్చారు వైసీపీ నేతలు. టీడీపీ తీరును నిరసిస్తూ గాంధీగిరి చేశారు. నేతలంతా చీపుర్లు పట్టుకుని ప్రధాన రోడ్లను ఊడ్చారు. టీడీపీ నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించామన్నారు నేతలు.
మరోవైపు వైసీపీ తీరును తప్పుబడుతున్నారు టీడీపీ నేతలు. ఎన్నికలు ఆపాలని తామేమీ కోర్టులో కేసులు వేయలేదన్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు వార్డుల విభజన చేశారని, అది నచ్చకే స్థానికులు కోర్టుకు వెళ్లి ఉంటారన్నారు. తమ పాపాలు కడుక్కునేందుకే వైసీపీ నేతలు రోడ్లను ఊడ్చారని విమర్శించారు. ఎలాగూ పారిశుధ్య సిబ్బంది లేరు కాబట్టి కనీసం రోడ్లయినా బాగుపడ్డాయని ఎద్దేశారు చేశారు టీడీపీ నేతలు.
Read also: Big News Big Debate: బద్వేలు ప్రీమియర్ లీగ్ – BPL వార్‌లో పేలుతోన్న మాటల తూటాలు