వందేమాతరం, జై శ్రీరామ్ నినాదాలతో జీ-20 సదస్సు మారుమోగింది. టోక్యోలో జరిగిన ఈ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. భారతదేశం ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవడంలో జపాన్ పాత్ర కీలకమని మోడీ అన్నారు. జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేతో పలు అంతర్జాతీయ వేదికలపై తను పాల్గొనే విధానం తమ మధ్య ఉన్న స్నేహబంధం స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. 2014లో తాను భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత షింజో అబెతో దౌత్యపరమై సంబంధాలను ఇరు దేశాల ప్రజల్లోకి తీసుకువెళ్లామన్నారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి భారతదేశ ప్రముఖులు స్వామి వివేకనందా, మహాత్మ గాంధీ, సుభాష్ చంద్రబోస్ తదితరులు జపాన్‌తో మంచి సంబంధాలను కొనసాగించారని తెలిపారు. రెండో ప్రపంచ యుద్దం అనంతరం భారత్, జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెరిగాయన్నారు ప్రధాని మోదీ. ఇరువురు దేశాధినేతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, విపత్తు నిర్వహణ, ఆర్థిక నేరస్థులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇక అక్టోబర్‌లో జరిగే జపాన్ చక్రవర్తి నరుహిటో పట్టాభిషేక వేడుకకి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతారని మోదీ తెలిపారు.