AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కనిపించినవి బాతు గుడ్లు అనుకుని తీసుకొచ్చి పొదగేశాడు.. తీరా పిల్లలు పుట్టాక చూస్తే..

బాతు గుడ్లనుకుని నెమలి గుడ్లను పొదిగించాడు. పిల్లలు బయటకు వచ్చాక అవి జాతీయ పక్షి నెమళ్లని గుర్తించినా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. అడవిలో వదలకుండా ఫామ్ హౌస్‌లోనే పెంచుతూ వచ్చాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపల్లిలో వెలుగుచూసిన ఈ ఘటనలో నాలుగు నెమళ్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా జాతీయ పక్షిని పెంచడం చట్టరీత్యా నేరం.

Telangana: కనిపించినవి బాతు గుడ్లు అనుకుని తీసుకొచ్చి పొదగేశాడు.. తీరా పిల్లలు పుట్టాక చూస్తే..
Eggs (Representative image)
Ram Naramaneni
|

Updated on: Nov 20, 2026 | 12:50 PM

Share

వికారాబాద్ జిల్లాలో జాతీయ పక్షి నెమళ్లను అక్రమంగా పెంచుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పరిగి మండలం పరిధిలోని రంగాపల్లి ఫామ్ హౌస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాతు గుడ్లనుకుని నెమలి గుడ్లను పొదిగించిన ఫామ్ హౌస్ సూపర్‌వైజర్.. పిల్లలు బయటకు వచ్చి.. కొంతకాలం పెరిగిన తర్వాత అవి నెమళ్లని తెలిసినా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా వాటిని అక్కడే పెంచుతూ వచ్చాడు.

ఫామ్ హౌస్ పరిసరాల్లోని కొన్ని గుడ్లను సూపర్‌వైజర్‌ గుర్తించాడు. అక్కడ బాతులు, కోళ్లను పెంచుతుండటంతో అవి బాతు గుడ్లేనని భావించాడు. వాటిని తీసుకొచ్చి బాతు గుడ్లతో కలిపి పొదిగేందుకు పెట్టాడు. సుమారు మూడు నెలల తర్వాత గుడ్లు పగిలి పిల్లలు బయటకు వచ్చాయి. అయితే అవి బాతు పిల్లలు కాకుండా నెమలి పిల్లలని గుర్తించాడు.

అయినప్పటికీ వాటి గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. సమీపంలోని అడవిలో కూడా వదిలిపెట్టకుండా ఫామ్ హౌస్‌లోనే పెంచుతూ వచ్చాడు. ఇలా మొత్తం నాలుగు నెమళ్లను తన వద్దే ఉంచుకున్నాడు. జాతీయ పక్షి అని తెలిసిన తర్వాత కూడా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం, అనుమతులు లేకుండా వాటిని పెంచడం చట్టవిరుద్ధం.

ఈ వ్యవహారంపై సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు రంగాపల్లి ఫామ్ హౌస్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ నాలుగు నెమళ్లు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ సూపర్‌వైజర్‌ను‌ అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల కోసం అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

నెమలి భారత జాతీయ పక్షి. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం దీనిని అనుమతులు లేకుండా బంధించడం, పెంచడం లేదా అక్రమంగా తరలించడం నేరం. వన్యప్రాణులు అనుకోకుండా ఇళ్లలోకి, వ్యవసాయ క్షేత్రాల్లోకి వచ్చినా వాటిని సొంతంగా పెంచకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఈ ఘటన వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.

Follow Us