దౌత్య‌, సైనిక ప‌ద్ద‌తుల్లో చైనాకు భార‌త్ వార్నింగ్ః రాజ్‌నాథ్ సింగ్

భారత్-చైనాలతో మధ్య స‌రిహ‌ద్దు వివాదాలు ఇంకా అప‌రిష్కృతంగా ఉన్న‌ాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ల‌డాఖ్‌లో కొద్దిరోజులుగా నెలకొన్న ప‌రిస్థితిపై రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ లోక్‌స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేశారు.

దౌత్య‌, సైనిక ప‌ద్ద‌తుల్లో చైనాకు భార‌త్ వార్నింగ్ః రాజ్‌నాథ్ సింగ్
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 15, 2020 | 3:52 PM

భారత్-చైనాలతో మధ్య స‌రిహ‌ద్దు వివాదాలు ఇంకా అప‌రిష్కృతంగా ఉన్న‌ాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ల‌డాఖ్‌లో కొద్దిరోజులుగా నెలకొన్న ప‌రిస్థితిపై రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ లోక్‌స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేశారు. దేశ ప్ర‌జ‌లంతా సైనికుల వెంటే ఉంటార‌ని ప్ర‌ధాని మోదీ ఆశాభావం వ్య‌క్తం చేసిన విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇటీవ‌లే ల‌డాఖ్ పర్యటనలో సైనికుల‌ సాహ‌సం, శౌర్యాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసాన‌ని తెలిపారు రాజ్‌నాథ్. క‌ల్న‌ల్ సంతోష్‌బాబు మాతృభూమి సేవ‌లో ప్రాణ‌త్యాగం చేశార‌ని కొనియాడారు.

రెండు దేశాల మ‌ధ్య సరిహద్దు వివాదం ఈనాటిది కాదని, 1950 నుంచి నెల‌కొన్న‌ద‌ని, కానీ ఇప్పటికీ సరియైన ప‌రిష్క‌రం లభించలేదన్నారు. ఇదో సంక్లిష్ట‌మైన స‌మ‌స్య అన్నారు. శాంతియుతంగానే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌్సిన అవసరముందన్నారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు వాస్త‌వాధీన రేఖ వెంట శాంతి, సామ‌ర‌స్యం ముఖ్య‌మ‌ని మంత్రి రాజ్‌నాథ్ అభిప్రాయ‌పడ్డారు. ఎల్ఏసీ వెంట శాంతి కోసం 1988 నుంచి రెండు దేశాల మ‌ధ్య సంబంధాల్లో అభివృద్ధి జ‌రిగిన‌ట్లు మంత్రి తెలిపారు.

వాస్త‌వాధీన రేఖ‌ను స‌రిగా మార్కింగ్ చేయ‌లేద‌ని చైనా భావిస్తున్న‌ట్లు మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. ఎల్ఏసీ వ‌ద్ద ఉన్న ప‌రిస్థితి వ‌ల్ల రెండు దేశాల మ‌ధ్య సంబంధాలపై ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. ఎల్ఏసీపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో గత కొంతకాలం సరిహద్దులో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయన్న రాజ్‌నాథ్.. ఏప్రిల్ నుంచి వాస్త‌వాధీన రేఖ వెంట చైనా త‌మ బ‌ల‌గాల‌ను మోహ‌రిస్తున్న‌ాయన్నారు. దౌత్య‌, సైనిక ప‌ద్ద‌తుల్లో చైనాకు భార‌త్ గట్టి గుణపాఠం చెబుతుందన్నారు.

స‌రిహ‌ద్దు వెంట ఉన్న సున్నితత్వాన్ని స‌భ అర్థం చేసుకుంటుంద‌ని భావిస్తున్నామన్న మంత్రి.. సైనిక ద‌ళాల త్యాగాల‌ను ప్ర‌శంసించాల‌న్నారు. గ‌త కొన్నేళ్ల నుంచి స‌రిహ‌ద్దుల్లో మౌళిక స‌దుపాయాల‌ను పెంచుతున్న‌ట్లు ఆయ‌న గుర్తుచేశారు. చైనా ద‌ళాలు హింసాత్మ‌క ధోర‌ణితో ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోపించారు. ఘ‌ర్ష‌ణాత్మ‌క ప్రాంతాల్లో భార‌త్ కూడా త‌మ బ‌ల‌గాల‌ను మోహ‌రించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. స‌రిహ‌ద్దు రక్షణకు భారత సైన్యం ఎలాంటి స‌వాళ్ల‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు మంత్రి. భారత సైనిక ద‌ళాల ప‌ట్ల గ‌ర్వంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.