
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో జవహర్ నవోదయ విద్యాలయాల్లోనే ఉండిపోయిన స్టూడెంట్స్ ను సొంత ఊర్లకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిర్ణయంతో వివిధ ప్రాంతాలలో ఉండిపోయిన దాదాపు 3వేల మందికి స్వాంతన లభించనుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 173 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఉండిపోయిన స్టూడెంట్స్ ను సేఫ్ గా ఇళ్లకు చేర్చనున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ వెల్లడించింది. నవోదయ విద్యాలయ సమితి కింద అంతర్భాగమైన జవహర్ నవోదయ విద్యాలయాలను..కరోనా కారణంగా.. మార్చి 21 నుంచి మూసేశారు. లాక్‌డౌన్ విధించడంతో చాలా మంది విద్యార్థులు వారి ఇళ్లకు వెళ్లిపోగా.. సమ్మర్ ట్రైనింగ్ క్లాసెస్ కారణంగా కొంత మంది అక్కడే ఉండిపోయారు. దాదాపు 3 వేల 169 మంది స్టూడెంట్స్ విద్యాలయాల్లో ఉన్నారు. తాజాగా వాళ్లని సురక్షితంగా ఇళ్లకి పంపేందుకు కేంద్రం రంగం సిద్దం చేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగవ విడత లాక్‌డౌన్ అమలవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ సడలింపలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల అంగీకారంతో అంతరాష్ట్రా బస్సు సర్వీసులు కూడా నడుపుకోవచ్చని తెలిపింది. కరోనాకు ఇంతవరకు సరైన మెడిసిన్ కానీ, వ్యాక్సిన్ కానీ కనుగొనలేకపోవడంతో..ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నాయి.